డబ్బుల వివాదంలో మండల నాయకుడిపై దాడి
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
కాకతీయ, గీసుగొండ: పంచాయితీ వ్యవహారంలో తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు తనపై దాడి చేశారంటూ మచ్చాపురం గ్రామానికి చెందిన మంద రమేష్ సోమవారం గీసుగొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ పరకాల నియోజకవర్గ అధికార ప్రతినిధి చాడ కొమురారెడ్డి ఓ సమస్యను పరిష్కరిస్తానని చెప్పి రూ.50 వేలు తీసుకున్నారు. అయితే పని చేయకపోగా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. ఈ విషయమై రమేష్ పలుమార్లు అడగ్గా నిరాకరించారు. దీనిపై బాధితుడు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో.. తనకు మండల అధ్యక్ష పదవి రాకుండా పోయిందనే కక్షను కొమురారెడ్డి పెంచుకున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం మరోసారి డబ్బుల గురించి అడిగేందుకు వెళ్లగా.. ఎమ్మెల్యే వద్దకు ఎందుకు వెళ్లావంటూ ఆగ్రహంతో దుర్భాషలాడుతూ కొమురారెడ్డి తనపై చెప్పుతో దాడి చేశారని రమేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తీవ్ర అవమానానికి గురిచేసిన సదరు నాయకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

