యాజమాన్య పద్ధతులతో సాగు ఖర్చులు తగ్గించుకోవాలి
‘రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు’లో డా.ఆర్.శ్రవణ్ కుమార్
కాకతీయ, గీసుగొండ: రైతులు మేలైన యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకోవచ్చని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా.ఆర్.శ్రవణ్ కుమార్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ గొర్రెకుంటలో వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎరువుల అధిక వాడకంతో సాగు ఖర్చులు పెరగడమే కాకుండా భూసారం దెబ్బతింటుందన్నారు. భూమిలో సేంద్రియ పదార్థాల పెంపునకు పచ్చిరొట్ట ఎరువులు వాడాలని, పంట మార్పిడి విధానాలు పాటించాలని సూచించారు. బయోటెక్నాలజీ శాస్త్రవేత్త డా.వై.హరి మాట్లాడుతూ.. మార్కెట్లో మంచి ధర లభించే వివిధ రకాల వరి వంగడాలపై రైతులకు అవగాహన కల్పించారు. జాతీయ ఆహార భద్రత పథకం జిల్లా కన్సల్టెంట్ సారంగం అధిక సాంద్రత పత్తి సాగు విధానాలను వివరించారు. ఈ వారంలోనే జీలుగ విత్తనాల పంపిణీ ప్రారంభమవుతుందని మండల వ్యవసాయ అధికారి పి.హరిప్రసాద్ బాబు తెలిపారు. రైతులు అధీకృత డీలర్ల వద్దే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి రశీదులు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ కందుల శ్రీనివాస్ రెడ్డి, ఏఈఓ గీత, సాయిల్ హెల్త్ వాలంటీర్ జి. సంజీవ్ మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.

