గిర్నిబావి స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
లారీని ఢీకొన్న కారు.. కాశిబుగ్గ యువకుడు వరుణ్ మృతి
కాకతీయ, దుగ్గొండి : నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారి గిర్నిబావి స్టేజి వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. వరంగల్ పట్టణంలోని కాశిబుగ్గ 20వ డివిజన్ పద్మానగర్‌కు చెందిన వెల్దండి వరుణ్ కారులో తెల్లవారుజామున వరంగల్ నుంచి నర్సంపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న వరుణ్.. మార్గమధ్యంలోని గిర్నీబావి స్టేజి వద్దకు రాగానే ఎదురుగా వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతినడంతో పాటు వరుణ్‌కు శరీర భాగాల్లో బలమైన గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, తీవ్రంగా గాయపడిన వరుణ్‌ను అత్యవసర చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో అతడు మృతి చెందినట్లు సమాచారం. కంటిముందే ఉన్న యువకుడు మృత్యువాత పడటంతో వరుణ్ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడికి భార్య నిఖిత, కుమారుడు హైత్విక్, కూతురు అహన ఉన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న దుగ్గొండి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు.


