చలో హైదరాబాద్’ను జయప్రదం చేయండి
‘మా తండాలో మా రాజ్యం’ స్ఫూర్తితో తరలిరావాలి
ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు బోడ మంగ్యజీ నాయక్
కారేపల్లిలో మహధర్నా వాల్ పోస్టర్లు, కరపత్రాల విడుదల
కాకతీయ, కారేపల్లి: లంబాడి హక్కుల పోరాట సమితి (ఎల్‌హెచ్‌పీఎస్) వ్యవస్థాపకులు బెల్లయ్య నాయక్, మూడవత్ రాంబాల్ నాయక్ ఆధ్వర్యంలో ఈనెల 26న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్ మహధర్నా’ను గిరిజన సమాజం అంతా ఏకమై జయప్రదం చేయాలని ఆ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బోడ మంగ్యజీ నాయక్ పిలుపునిచ్చారు. మంగళవారం కారేపల్లి మండల కేంద్రంలో మహధర్నా వాల్ పోస్టర్లు, కరపత్రాలను ఆయన విడుదల చేసి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంగ్యజీ నాయక్ మాట్లాడుతూ.. ముప్పై ఏళ్లుగా గిరిజన సమస్యలపై ఎల్‌హెచ్‌పీఎస్ రాజీలేని పోరాటాలు చేస్తోందన్నారు. గిరిజనుల చిరకాల స్వప్నమైన “మా తండాలో మా రాజ్యం” లక్ష్యాన్ని సాధించడంతో పాటు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయించిన ఘనత ఈ సంస్థదేనన్నారు. దీని స్ఫూర్తితోనే వందలాది మంది గిరిజన బిడ్డలు రాజకీయంగా ఉన్నత స్థానాలకు ఎదిగారని పేర్కొన్నారు.
చేవెళ్ల డిక్లరేషన్ హామీలను అమలు చేయాలి
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు ఇచ్చిన “చేవెళ్ల డిక్లరేషన్” లోని 12 హామీలను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తండాల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి యువత, మేధావులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీఎస్ నాయకులు లకావత్ విను వికాస్, లకావత్ రాందాస్, భూక్యా నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

