వాట్సాప్‌లోనే మరిన్ని జీహెచ్‌ఎంసీ సేవలు
కొత్తగా తొమ్మిది పౌర సేవలు అందుబాటులోకి
మొబైల్ ఫోన్ ద్వారానే ప్రభుత్వ సేవలు పొందే వీలు
డిజిటల్ సేవలను మరింత విస్తరించిన ప్రభుత్వం
త్వరితగతిన దరఖాస్తుల నమోదుకు ప్రత్యేక ఏర్పాటు
కాకతీయ, జీహెచ్ఎంసీ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పౌర సేవలను కొత్తగా మీసేవ వాట్సాప్ మరియు చాట్‌బాట్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజలకు మరింత సౌకర్యం, అందుబాటు, పారదర్శకత కల్పించే దిశగా ఈ సేవలను విస్తరించారు. ఈ మేరకు ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నాయకత్వంలో మీసేవ ద్వారా పౌర సేవలను మరింతగా తీర్చిదిద్దుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ సేవల ప్రధాన వేదికగా ఉన్న మీసేవను వాట్సాప్ మరియు చాట్‌బాట్ ద్వారా మరింత విస్తరించారు. ఈ అదనపు డిజిటల్ వేదికను గతేడాది నవంబర్ పద్దెనిమిదో తేదీన ప్రారంభించారు.
కొత్తగా తొమ్మిది రకాల సేవలు
కొత్తగా జీహెచ్‌ఎంసీ ఆస్తి పన్ను అంచనా సవరణ, జనన ధ్రువీకరణ సవరణ, మరణ ధ్రువీకరణ సవరణ, ఇంటి దగ్గర పుట్టిన వారి జనన నమోదు, ఇంటి దగ్గర చనిపోయిన వారి మరణ నమోదు, ఆస్తి తలుపు నంబర్ సవరణ, ఆస్తి పేరు సవరణ, ఆస్తి పన్ను సేవలు, వ్యాపార లైసెన్స్ పునరుద్ధరణ సేవలను వాట్సాప్ మీసేవలో చేర్చారు. రాష్ట్రవ్యాప్తంగా పౌరులు ఈ సేవలను వాట్సాప్ ద్వారానే పొందవచ్చని ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ విభాగం తెలిపింది. సేవలు పొందేందుకు ముందుగా ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు తొమ్మిది ఐదు ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు నంబర్‌ను మొబైల్‌లో మీసేవ తెలంగాణ పేరుతో సేవ్ చేసుకోవాలి. అనంతరం వాట్సాప్‌లో ఆ నంబర్‌కు హాయ్ అని సందేశం పంపాలి. అవసరమైన సేవ పేరు టైప్ చేసి, మెనూలో కనిపించే ఓపెన్ సర్వీస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఫారంలో అడిగిన వివరాలు, చెల్లింపు పూర్తిచేస్తే దరఖాస్తు వెంటనే వాట్సాప్ ద్వారా నమోదవుతుంది.
ప్రజల నుంచి విశేష స్పందన
వాట్సాప్ ఆధారిత మీసేవ వేదికకు ప్రారంభం నుంచి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని ప్రభుత్వం వెల్లడించింది. జనన ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, పోలీస్ చలాన్, విద్యుత్ బిల్లు, ఇంటర్మీడియట్ ఫలితాల సేవలను ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నట్లు తెలిపింది. రోజువారీ పరిపాలన సేవలకు వాట్సాప్‌పై ప్రజల ఆధారపడటం పెరుగుతోందని పేర్కొంది. డిజిటల్ సేవలను నిరంతరం విస్తరించడం, ప్రభుత్వ వ్యవస్థల విశ్వసనీయతను బలోపేతం చేయడం, పౌరులకు సులభమైన అనుభవం కల్పించడం తమ లక్ష్యమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

