అసైన్డ్ భూముల్లో.. అక్రమ కట్టడాలు!
దళిత కుటుంబానికి తీరని అన్యాయం
సాగు భూమి కాస్త గృహసముదాయాలుగా మారిన వైనం
ఎలాంటి మార్పిడి లేకుండానే విలాసవంతమైన భవనాల నిర్మాణం
పదవి అడ్డం పెట్టుకొని అధికారులతో తప్పుడు పనులు చేసిన అక్రమార్కులు
న్యాయం కోసం కాకతీయను ఆశ్రయించిన బాధితులు
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగరం 3వ పట్టణ ప్రాంతంలో అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరిపారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 60 ఏళ్ల క్రితం భూమి లేని దళిత కుటుంబాలకు ఆనాటి ప్రభుత్వాలు సాగు చేసుకునేందుకు అసైన్డ్ భూములను అప్పజెప్పడం జరిగింది. నగరం విస్తరిస్తున్న కొలది ఆ భూములపై అక్రమార్కుల కన్నుపడింది. ఆ భూముల్లో పాగా వేసేందుకు రంగం సిద్ధం చేశారు. సర్వే నెంబర్ 123ను తప్పుడు సర్వే నెంబర్ గా చూపి ఆ భూముల్లో అక్రమ రిజిస్టేషన్లు చేసుకొని అధికారులను సైతం తప్పుదోవ పట్టించారు. ఇలాంటి ఆక్రమణ వల్ల తమ భూమిని కోల్పోయామంటూ మద్దెల భాగ్యమ్మ, స్వరూప లు కాకతీయ పత్రికను ఆశ్రయించారు. ఆనాటి ప్రభుత్వాలు సాగు చేసుకునేందుకు స్థానిక వాసవి గార్డెన్ సమీపంలో సర్వే నెంబర్ 123లో సుమారు 1 ఎకరం అసైన్డ్ భూమిని ఇవ్వడం జరిగిందన్నారు. భూముల రేట్లు పెరగడంతో కొంతమంది అక్రమార్కులు తమ భూమి కాజేసి తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించి, ఒక్కొక్క ప్లాట్ పై 2 సార్లు రిజిస్ట్రేషన్లు చేయించి అమ్ముకున్నారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఆ భూమిలో నిర్మాణాలు చేపట్టాలి అంటే ఖచ్చితంగా భూమి మార్పిడి జరపాల్సి ఉంటుంది. అంతే కాక రిజిస్ట్రేషన్ జరగాలి అన్నా, మరొకరికి ఆ భూమిని అమ్మాలి అన్నా ఎవరికీ హక్కు ఉండదు. అలాంటిది సుమారు ఎకరం భూమి తమకు తెలియకుండానే కొందరు అక్రమార్కులు ఈ పని చేశారని వారు ఆవేదన చెందారు.

రాజకీయ అండదండలతో దందా
ఓ మాజీ మంత్రి అండదండలతో ప్రముఖ రియల్టర్, కార్పొరేటర్ల దందా చేసి భూమి కాజేసినట్లు బాధితులు తెలిపారు. వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా ముక్కలు మనకే అనే చందంగా అక్రమ కట్టడాలు జరిపినట్లు వాపోయారు. ఒకప్పటి దళితకుటుంబం జీవనోపాధి కోసము ప్రభుత్వం ఇస్తే ఇచ్చిన సాగుభూమిలో నేడు అక్రమార్కుల అందమైన భవంతుల నిర్మాణాలు జరిగాయి. దళితకుటుంబం ఆర్థిక ఇబ్బందుల వలన సాగుచేయకుండా ఉన్న భూమిని అప్పనంగా తీసుకుని, పలువురికి శ్రీనివాస నగర్ ప్రాంతంలోని సర్వే నెంబర్ తో ప్లాట్లు చేసి అమ్మకాలు జరిపారు. ఇప్పటికీ కొంత మంది తప్పుడు సర్వే చేశారని, రిజిస్ట్రేషన్లు రద్దు చేసి మా డబ్బులు మాకివ్వమని కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారని చెప్పుకొస్తున్నారు. ఇదే అదనుగా భావించిన కొందరు అక్రమార్కులు ఆ ఏరియాలో ఉన్న రేటు కన్నా తక్కువ రేటుతో కొట్టేశారు. నాటి మంత్రి, కొంతమంది కార్పొరేటర్లు కార్పొరేషన్ అధికారులతో కుమ్మక్కై అక్రమంగా ఇంటి నెంబర్లు సంపాదించి, అంతా మా ఇష్టం అనే రీతిగా అనుమతులు లేని బోర్లతో అక్రమంగా భవనాలు నిర్మించారు. వీరికి అభివృద్ధి అనే పదంతో గోళ్లపాడు చానల్ కాలువ కూడా కలిసొచ్చింది. ఇదే అదనుగా కాలువను కుదించగా మిగిలిన స్థలాన్ని కార్ల నిలుపుదలకు వాడుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు.
న్యాయం కోసం బాధితుల పోరాటం
కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్ల అక్రమార్కులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. నాటి ప్రభుత్వంలో ఈ దళిత కుటుంబ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ప్రజాప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందనే ఆశతో మంత్రులపై ఆశలతో అన్ని పత్రాలు, అనుభవ పత్రాలను సిద్ధం చేసుకున్నారు బాధితులు. ఇక్కడ న్యాయం జరగకపోతే న్యాయం కోసం ఉన్నత న్యాయస్థానానికి వెళ్లే పనిలో ఉన్నారు. అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై ఎస్సీ కమిషన్ చైర్మన్ కు ఫిర్యాదు చేయనున్నారు.

