ఉపాధి కూలీలకు ఊరట
మండుతున్న ఎండలో చల్లటి మజ్జిగ పంపిణీ
సర్పంచ్ గుగులోత్ అక్రీ రాంజీ నాయక్
కాకతీయ, రాయపర్తి : రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మండల కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి.ఆయా గ్రామాల్లోని సామాన్య ప్రజలు,ఉపాధి హామీ పనులకు వెళ్లే శ్రామికులు తీవ్ర స్వస్థతకు గురవుతున్నారు.ఈ క్రమంలో బంధనపల్లి గ్రామంలో సర్పంచ్ గుగులోత్ అక్రీ రాంజీ నాయక్ ఆధ్వర్యంలో గురువారం ఉపాధి హామీ కూలీలకు ఊరటనిస్తూ ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు.గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశానికి సర్పంచ్ స్వయంగా వెళ్లి కూలీలతో మాట్లాడారు.వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని,తీవ్రమైన ఎండలో శ్రమిస్తున్న కూలీలందరికీ చల్లటి మజ్జిగ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రోజురోజుకు ఎండలు ముదురుతున్నాయని,కూలీలు వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.పని ప్రదేశాల్లో తాగునీరు,నీడ సౌకర్యం కల్పించడంతోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉంచామని అన్నారు.ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కూలీలు ఉదయాన్నే పని ప్రదేశానికి చేరుకొని,మధ్యాహ్నం లోపు పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలని కోరారు.అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు రాకూడదని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మంద అశోక్,వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి అరవింద స్వామి,ఫీల్డ్ అసిస్టెంట్ డెక్క అశోక్,ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

