అవినీతి ‘అనకొండ’కు 14 రోజుల రిమాండ్!
చంచల్‌గూడ జైలుకు వాటర్ బోర్డు జీఎం లక్ష్మీకుమార్
కోట్లలో నగదు, కేజీల కొద్దీ బంగారం, వెండి వస్తువులు స్వాధీనం
హైదరాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో భారీగా అక్రమాస్తులు
కాకతీయ,తెలంగాణ బ్యూరో : అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారి, ఏసీబీ అధికారులకు దొరికిన వాటర్ బోర్డు జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీకుమార్‌కు ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు కోర్టు ఆదేశాల ప్రకారం బుధవారం రాత్రి ఆయనను చంచల్‌గూడ కేంద్ర కర్మాగారానికి (జైలుకు) తరలించారు. కాగా, లక్ష్మీకుమార్ ఇల్లు, కార్యాలయాలపై ఏసీబీ సోదాల్లో బయటపడిన అక్రమాస్తుల విలువ చూసి స్వయంగా అధికారులే ముక్కున వేలేసుకున్నారు. మల్లాపూర్‌లోని ఆయన నివాసంలో లెక్సించని రూ. 1.10 కోట్ల నగదు, రూ. కోట్ల విలువైన 2.1 కిలోల బంగారు ఆభరణాలు, 9.2 కిలోల వెండి వస్తువులను గుర్తించారు. అలాగే నిజామాబాద్ జిల్లా నవీపేటలో 3.5 ఎకరాల భూమి, సంగారెడ్డి జిల్లా చేర్యాలలో 13 ఎకరాల విలువైన వ్యవసాయ భూమిని గుర్తించారు. హైదరాబాద్‌లో ఒక లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్, నిజామాబాద్ నవీపేటలో భారీ కొబ్బరి తోటతో పాటు విలాసవంతమైన ఫామ్ హౌస్ ఉంది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీలో 3 లగ్జరీ ప్లాట్లు, నగరంలోని వివిధ ప్రాంతాల్లో మరో 6 ఓపెన్ ప్లాట్లు. కుటుంబ సభ్యుల పేరిట ఉన్న రెండు విలాసవంతమైన కార్లు, ఒక బైక్ ఉన్నట్లుగా గుర్తించారు.
వాటర్ ట్యాంకర్ల దందాతో రోజుకు రూ. 50 వేల సంపాదన!
నగరంలో నీటి ఎద్దడిని ఆసరాగా చేసుకుని జీఎం లక్ష్మీకుమార్ వాటర్ ట్యాంకర్ల అక్రమ దందా నడిపినట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలింది. ప్రైవేట్ వ్యక్తులతో చేతులు కలిపి ప్రభుత్వ నీటిని అక్రమంగా విక్రయిస్తూ.. కేవలం ట్యాంకర్ల ద్వారానే రోజుకు రూ. 50,000 వరకు అక్రమ సంపాదన ఆర్జించినట్లు అధికారులు గుర్తించారు. జీఎం లక్ష్మీకుమార్ బినామీల పేరిట మరిన్ని ఆస్తులు కూడబెట్టినట్లు అనుమానిస్తున్న ఏసీబీ అధికారులు, ఆ దిశగా బ్యాంకు లాకర్లను, ఖాతాలను పరిశీలిస్తున్నారు.

