సింగరేణికి సోలార్ ఎనర్జీ
నిల్వ సామార్థ్యంతో సింగరేణికి సిరులు
సోలార్ విద్యుత్‌ను నిల్వ చేస్తున్న బీఈఎస్ఎస్
2.5కోట్ల వ్యయాంతో ఒక మెగావాట్ సామర్థ్యం నిల్వ
గ్రిడ్‌కు వెళ్లే విద్యుత్‌ను నిల్వ చేసుకునే సాంకేతికత
మొదటిసారిగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ ఏర్పాటు
మందమర్రి సోలార్ ప్లాంట్ వద్ద ప్రయోగాత్మకంగా ప్రాజెక్టు
రాష్ట్రంలోనే తొలి అతిపెద్ద ప్రాజెక్టు సింగరేణిలో ఏర్పాటు
నాలుగు నెలల్లోనే సత్ఫలితాలు… బీఈఎస్ఎస్‌తో రూ.26 లక్షల ఆదా
కాకతీయ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో తొలిసారిగా సింగరేణి సంస్థలో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ అద్భుతమైన సత్ఫలితాలను ఇస్తోందని సంస్థ యాజమాన్యం ప్రకటించింది. పగటిపూట ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్తులో స్థానిక వినియోగం పోను మిగిలిపోయే విద్యుత్తును ఉచితంగా గ్రిడ్‌కు వదలకుండా, బ్యాటరీలలో భద్రపరుచుకుని అవసరమైనప్పుడు వాడుకునేలా చేసిన ఈ సరికొత్త ప్రయోగం సింగరేణికి భారీగా ఆర్థిక లబ్ధిని చేకూరుస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు నాలుగు నెలల క్రితం మందమర్రి ఏరియాలోని 28 మెగావాట్ల సింగరేణి సోలార్ ప్లాంట్‌కు అనుబంధంగా ఒక మెగావాట్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ ప్రాజెక్టును నెలకొల్పారు. ఇందుకోసం సింగరేణి యాజమాన్యం రూ.25,000,000 వెచ్చించింది. జనవరి నెలలో ప్రారంభమైన ఈ వ్యవస్థ ద్వారా ఇప్పటివరకు స్థానిక అవసరాలకు వినియోగించగా మిగిలిన 335485 యూనిట్ల విద్యుత్తును విజయవంతంగా నిల్వ చేసుకొని, అవసరమైన సందర్భాల్లో పునరునియోగించుకున్నారు. తద్వారా కేవలం నాలుగు నెలల స్వల్ప వ్యవధిలోనే సింగరేణి సంస్థకు రూ.2,566,460 ఆర్థిక లాభం చేకూరిందని యాజమాన్యం వెల్లడించింది.

ఉచిత సరఫరాకు చెక్
రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్తుకు అందిస్తున్న భారీ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని సింగరేణితో సహా పలు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు సోలార్ విద్యుత్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నాయి. ఇందులో భాగంగా సింగరేణి సంస్థ ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో మొత్తం 8 చోట్ల 245.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను విజయవంతంగా ఏర్పాటు చేసింది. వీటిలో 147 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను ఓపెన్ యాక్సెస్ ప్లాంట్లుగా గుర్తించగా, మిగిలిన 98.50 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను ఇన్ హౌజ్ ప్లాంట్లుగా పరిగణించి తెలంగాణ విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. అయితే ప్రస్తుత విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రకారం ఈ ఇన్ హౌజ్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను స్థానిక గనులు, కాలనీల అవసరాలకు వాడగా, మిగిలిపోయే అదనపు విద్యుత్తుకు తెలంగాణ డిస్కములు ఎలాంటి చెల్లింపులు జరపవు.
ప్రయోగాత్మక ప్రాజెక్టు సక్సెస్
డిస్కముల నుంచి ఎలాంటి చెల్లింపులు లేకపోవడంతో రోజువారీగా వేలాది యూనిట్ల మిగులు విద్యుత్తును ఎటువంటి ఆర్థిక ప్రయోజనం లేకుండా ఉచితంగానే గ్రిడ్‌కు సరఫరా చేయాల్సి వచ్చేది. ఈ విధంగా నష్టపోతున్న మిగులు విద్యుత్తును కూడా సంపూర్ణంగా సొమ్ము చేసుకోవాలన్న బలమైన ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం సింగరేణి సంస్థ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఒక మెగావాట్ సామర్థ్యం గల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ సాంకేతికతను మందమర్రి ప్లాంట్‌లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. మందమర్రిలో గల 28 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రస్తుతం ఎంతో సమర్థంగా పనిచేస్తూ మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాలలోని బొగ్గు గనులకు, కార్మిక కాలనీలకు అవసరమైన విద్యుత్తును నిరంతరాయంగా అందిస్తోంది.
మరిన్ని ప్లాంట్లకు సన్నాహాలు
స్థానిక అవసరాలు తీరిన తర్వాత మిగిలిపోతున్న విద్యుత్ అంతా ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ ద్వారా నిల్వ అవుతుండటంతో సింగరేణికి అదనపు సిరులు కురుస్తున్నాయి. కేవలం ఒక మెగావాట్ సామర్థ్యం గల బ్యాటరీ యూనిట్ ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్తును, సంస్థ నిధులను ఆదా చేయడం విశేషమని నిపుణులు కొనియాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో ఇక్కడ ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ బ్యాటరీ నిల్వ ప్రాజెక్టు వంద శాతం విజయవంతం అవడంపై సింగరేణి యాజమాన్యం తీవ్ర హర్షం వ్యక్తం చేసింది. పునరుత్పాదక ఇంధన వనరులను గరిష్టంగా వినియోగించుకోవాలనే ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా, భవిష్యత్తులో మరిన్ని సోలార్ ప్లాంట్ల వద్ద ఇలాంటి బ్యాటరీ స్టోరేజీ ప్రాజెక్టులను విస్తృతంగా చేపట్టేందుకు సంసిద్ధంగా ఉన్నామని సింగరేణి యాజమాన్యం స్పష్టం చేసింది.

