న్యాయవాది మొయినుద్దీన్ హత్య..?
మాసబ్ ట్యాంక్‌లో కారుతో ఢీకొట్టి పరారైన దుండగులు
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన లాయర్
వక్ఫ్ బోర్డు భూముల కబ్జాలపై న్యాయపోరాటం చేస్తుండటమే కారణమా?
ప్రణాళికాబద్ధంగానే యాక్సిడెంట్ పేరిట హతమార్చారంటూ బలమైన అనుమానాలు
ఆరోపణలకు బలం చేకూరుస్తున్న సీసీ ఫుటేజీ దృశ్యాలు
హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ లో దారుణం. గత కొన్ని రోజులుగా వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం పోరాడుతున్న సీనియర్ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య. ఉదయం తన ఇంటి నుంచి బయటకి రాగానే కారుతో వేగంగా వచ్చి ఢీకొట్టి పారిపోయిన దుండగులు (1/2) pic.twitter.com/p37MdkCpW6
— Telangana Express (@XpressTG) May 23, 2026
కాకతీయ,తెలంగాణ బ్యూరో : రాజధాని నగరంలో వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం, కబ్జాదారులకు వ్యతిరేకంగా సుదీర్ఘంగా న్యాయపోరాటం చేస్తున్న ప్రముఖ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్యకు గురయ్యారు. హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ పరిధిలో శనివారం జరిగిన ఈఘటన పక్కా ప్లానింగ్‌తో జరగగా.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లుగా అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. గుర్తుతెలియని దుండగులు కారుతో ఆయనను బలంగా ఢీకొట్టి, కారు ఆపకుండానే అక్కడి నుంచి వేగంగా పారిపోయారు. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి తీవ్ర రక్తస్రావమైన మొయినుద్దీన్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో మృత్యువుతో పోరాడుతూ ఆయన చికిత్స పొందుతూనే పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు.

యాక్సిడెంట్ కాదు.. పక్కా ప్లాన్ ప్రకారం హత్యే?
న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ సాధారణ రోడ్డు ప్రమాదంలో మరణించలేదని, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే అనుమానాలు దౌత్య, న్యాయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. నగరంలో కోట్ల రూపాయల విలువైన వక్ఫ్ బోర్డు భూములు అక్రమంగా కబ్జాకు గురవుతుండటంపై ఆయన చాలా కాలంగా న్యాయస్థానాల్లో బాధితుల తరఫున గట్టిగా పోరాడుతున్నారు. భూమాఫియా గుట్టును రట్టు చేస్తూ, కబ్జాదారుల గుండెల్లో నిద్రపోతున్న మొయినుద్దీన్‌ను వదిలిపెడితే తమ అక్రమ దందాలకు అడ్డు వస్తారనే పగతోనే.. కబ్జాదారులు ప్రణాళికాబద్ధంగా హిట్ అండ్ రన్ స్కెచ్ వేసి హతమార్చారని ఆయన సహచర న్యాయవాదులు, కుటుంబ సభ్యులు బలంగా అనుమానిస్తున్నారు.
రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీల పరిశీలన
మాసబ్ ట్యాంక్ లాంటి అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో పగటిపూట ఒక న్యాయవాదిని కారుతో ఢీకొట్టి చంపడంపై నగర పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ మార్గంలో ప్రయాణించిన వాహనాల వివరాలు, నిందితులు పారిపోయిన కారు నంబరును గుర్తించేందుకు ఘటనా స్థల పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు కూలంకషంగా పరిశీలిస్తున్నారు. వక్ఫ్ భూముల వివాదంలో ఆయనకు ఎవరైనా బెదిరింపులు తెచ్చారా? ఇటీవలి కాలంలో ఆయన ఏయే కేసుల్లో హాజరవుతున్నారు? అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్తుండగా, ఈ దారుణ హత్యపై లాయర్ల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

