వేసిన తాళం వేసినట్టే
ఎంజీఎంలో తెరుచుకోని ‘ఎర్ర పెట్టెలు’
అధికారుల పర్యవేక్షణలోపంతో మూలనపడిన ఫిర్యాదుల బాక్సులు!
రోగుల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టర్ సత్యశారద చొరవతో ఏర్పాటు
ఫిర్యాదులను పరిశీలించకుండా ఆసుపత్రి యంత్రాంగం నిర్లక్ష్యం
ఉన్నతాధికారుల ఆదేశాల అమలులో కిందిస్థాయి అధికారుల ఉదాసీనత
సమన్వయ లోపంతో ఆశించిన ఫలితం ఇవ్వని ఉత్తమ వినూత్న కార్యక్రమం
కాకతీయ, వరంగల్ : వరంగల్ నగరంలోని ప్రతిష్టాత్మక మహాత్మా గాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సమస్యల తక్షణ పరిష్కారానికి ఏర్పాటు చేసిన వినూత్న ‘ఎర్ర పెట్టెలు’ (ఫిర్యాదుల బాక్సులు) ఆసుపత్రి అధికారుల సమన్వయ లోపంతో అలంకారప్రాయంగా మారిపోయాయి. జిల్లా కలెక్టర్ సత్య శారద ప్రత్యేక చొరవతో సుమారు రూ.30 వేల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఏర్పాటు చేయించిన ఈ పెట్టెలను క్షేత్రస్థాయిలో క్రమబద్ధంగా పర్యవేక్షించడంలో ఆసుపత్రి యంత్రాంగం విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య సేవల నాణ్యతను పెంచేందుకు, సిబ్బంది జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద గతంలో ప్రత్యేక దృష్టి సారించారు. ఆసుపత్రిని స్వయంగా సందర్శించి లోపాలను సరిదిద్దిన కలెక్టర్, రోగులు తమ ఇబ్బందులను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వీలుగా అన్ని వార్డుల్లో ఈ ఎర్రపెట్టెలను ఏర్పాటు చేయించారు. రోగుల నుండి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా ఆసుపత్రి పనితీరును మరింత మెరుగుపరచడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం.
అధికారుల ఉదాసీనత.. వేసిన తాళం వేసినట్టే!
కలెక్టర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పెట్టెలను ఏర్పాటు చేయించినప్పటికీ, క్షేత్రస్థాయిలోని ఆసుపత్రి అధికారులు వాటి నిర్వహణను పూర్తిగా విస్మరించారు. బాక్సులు ఏర్పాటు చేసి దాదాపు ఏడాది కావస్తున్నా, ఇప్పటివరకు ఒక్కసారి కూడా వాటిని తెరిచి రోగుల ఫిర్యాదులను క్రోడీకరించిన దాఖలాలు లేవని ఆసుపత్రి సిబ్బంది ద్వారా తెలుస్తోంది. ఈ పెట్టెలను ఎవరు తెరవాలి? ఏ సమయానికి ఫిర్యాదులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి? అనే నియమ నిబంధనలపై ఆసుపత్రి వర్గాలు స్పష్టత తెచ్చుకోకపోవడం, కిందిస్థాయి అధికారుల మధ్య సరైన సమన్వయం లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. తమ పరిధిలోని బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకుండా ఆసుపత్రి యంత్రాంగం చేతులెత్తేయడంపై రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఫలితం ఇవ్వని ఉన్నతాధికారుల మార్గదర్శకత్వం
జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి కోసం ఎన్ని కొత్త ప్రణాళికలు ప్రవేశపెడుతున్నా, స్థానిక అధికారుల పర్యవేక్షణా లోపం వల్ల అవి పేద రోగులకు చేరడం లేదు. ఆసుపత్రిలో ల్యాబ్ పరీక్షలు, మందుల పంపిణీ, రక్త నిల్వల లభ్యత వంటి అంశాలపై రోగులు పడుతున్న ఇబ్బందులను ఈ పెట్టెల ద్వారా తెలుసుకునే అవకాశం ఉన్నా.. అధికారులు ఆ దిశగా అడుగులు వేయకపోవడం గమనార్హం. కేవలం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కలెక్టర్ చొరవతో వచ్చిన ఈ మంచి వ్యవస్థ గోడలకే పరిమితమైందని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఆసుపత్రి ఉన్నతాధికారులు స్పందించి, ఎర్ర పెట్టెల తాళాలు తీయించి, రోగుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.

