ఈత సరదా.. మరో నిండు ప్రాణం బలి
బావిలో ఈతకు వెళ్లి చందుర్తిలో విద్యార్థి మృతి
రెండు రోజుల క్రితమే సిరిసిల్లలో ఇద్దరు మృతి.. అంతలోనే మరో ఘోరం
పోలీసులు హెచ్చరిస్తున్నా మారని యువత
తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
కాకతీయ, చందుర్తి : వేసవి కాలంలో ఈత కొట్టాలనే సరదా మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరుసగా జరుగుతున్న ఇటువంటి ప్రమాదాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన అజయ్ అనే విద్యార్థి, మండల కేంద్రంలోని ఓ వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న వెంటనే చందుర్తి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులు, ఈతగాళ్ల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. బావిలో గంటల పాటు సాగిన శోధన అనంతరం అజయ్ మృతదేహాన్ని వెలికితీశారు. కండ్లముందే కుమారుడు శవమై తేలడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బావి గట్టుపైనే కన్నీరు మున్నీరుగా విలపించడం అక్కడి వారిని కలచివేసింది.
జిల్లాలో వరుస విషాదాలు
కేవలం రెండు రోజుల క్రితమే సిరిసిల్ల శాంతినగర్ శివారులో ఇద్దరు విద్యార్థులు ఈత కోసమని వెళ్లి లోతైన నీటి కుంటలో పడి మృతి చెందిన ఘోర ఘటన మరువకముందే.. ఇప్పుడు చందుర్తి మండలంలో మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం జిల్లావాసులను షాక్‌కు గురిచేస్తోంది. ఎండల తీవ్రత పెరగడంతో విద్యార్థులు, యువకులు ఇళ్లకు సమీపంలోని చెరువులు, బావుల వైపు పరుగులు తీస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ వరుస విషాదాలపై రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలు చెరువులు, బావులు, వాగులు వంటి ప్రమాదకర ప్రాంతాలకు ఈత కోసం వెళ్లకుండా పోలీసులు ముందస్తుగా పలుమార్లు హెచ్చరిస్తున్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి నష్టాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం వేళల్లో పిల్లలు ఇళ్ల నుండి ఎక్కడికి వెళ్తున్నారనే అంశంపై నిఘా ఉంచాలని సూచించారు. లోతు తెలియని నీటి వనరుల వద్దకు వెళ్లకుండా పిల్లలను కట్టడి చేయాలని, లేనిపక్షంలో ఇలాంటి తీరని నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

