కాంగ్రెస్ కసరత్తు
పార్టీ పునర్నిర్మాణంపై మండల అధ్యక్షుల ఫోకస్
గ్రామ అధ్యక్షుల నియామకానికి నేతల ఆరా
పరకాల కాంగ్రెస్‌లో ‘స్థానిక’ సమరం
కమిటీల పునర్నిర్మాణం వెనుక అసలు వ్యూహం అదేనా?
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలే లక్ష్యంగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పావులు
గులాబీ కోటను బద్దలు కొట్టేందుకు ప్రణాళికలు
గ్రామ కమిటీల ఏర్పాటుకు క్షేత్రస్థాయిలో వేగంగా కదలికలు
అసంతృప్తులకు చెక్ పెట్టేలా సర్పంచ్ ఎన్నికల్లో ఓడిన వారికి పార్టీ పదవులు..?
నియోజకవర్గంలో వర్గపోరు సెగలను తట్టుకుంటూ ఎమ్మెల్యే రేవూరి ముందుకు
పార్టీ జిల్లా అధ్యక్షులు ఇనగాల వెంకట్రామి రెడ్డితో కలిసి వ్యూహాత్మక అడుగులు
కాకతీయ, పరకాల : పరకాల నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్‌గానే సాగుతుంటాయి. ఇక్కడి పొలిటికల్ గ్రౌండ్ లో పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలు పన్నుతుంటాయి. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో గ్రామస్థాయి నుంచి సంస్థాగతంగా సమూల మార్పులు చేస్తూ పునర్నిర్మాణ కసరత్తును ముమ్మరం చేసింది. ఇటీవల కాలంలో ఇక్కడ నూతన మండల కమిటీల నియామకం పూర్తి కావడంతో ఊపు మీదున్న హస్తం పార్టీ శ్రేణులు, ఇప్పుడు గ్రామ కాంగ్రెస్ కమిటీల ఏర్పాటుతో పాటు గ్రామ అధ్యక్షుల ఎంపికపై పూర్తిస్థాయిలో కేంద్రీకరించాయి. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి కోటను క్లీన్ స్వీప్ చేయడమే ఏకైక లక్ష్యంగా అధికార పార్టీ అడుగులు వేస్తోంది.




క్షేత్రస్థాయిలో రేవూరి మార్క్ సోషల్ ఇంజినీరింగ్
పరకాలలో గత ఎన్నికల నాటి నుంచి కొనసాగుతున్న అంతర్గత విభేదాలు, స్థానిక నేతల మధ్య ఉన్న కోల్డ్ వార్ ను చల్లబరిచేందుకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన మండల అధ్యక్షులు, పార్టీ సమన్వయ కమిటీ సభ్యులను రంగంలోకి దించి గ్రామాల్లో విస్తృతంగా పర్యటింపజేస్తున్నారు. సీనియర్ నాయకులు, సాధారణ కార్యకర్తలను సమన్వయం చేస్తూ అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. పరకాల నియోజకవర్గంలోని ఆయా గ్రామాల వారీగా ఉన్న సామాజిక సమీకరణాలను (సోషల్ ఇంజినీరింగ్) నిశితంగా పరిశీలిస్తూ, ఏ ఒక్క వర్గానికి అసంతృప్తి కలగకుండా కమిటీలలో సమతూకం పాటించేలా ఎమ్మెల్యే మార్క్ రాజకీయం స్పష్టంగా కనిపిస్తోంది.
ఓడిన వారికి ఊరట… అసంతృప్తులకు బ్రేక్
ఈ సంస్థాగత నియామకాల్లో కాంగ్రెస్ అధిష్ఠానం ఒక సరికొత్త ఫార్ములాను తెరపైకి తెచ్చింది. గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయి నైరాశ్యంలో ఉన్న కీలక నాయకులకు, అలాగే సుదీర్ఘకాలంగా జెండా మోస్తూ ఎలాంటి అధికారిక పదవులు లేని అసంతృప్త కార్యకర్తలకు ఈ గ్రామ కమిటీలలో అగ్ర ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దీనివల్ల ద్వితీయ శ్రేణి నాయకత్వంలో ఉన్న అసంతృప్తి చల్లారడమే కాకుండా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరంతా మరింత కసితో పనిచేస్తారని నాయకత్వం భావిస్తోంది. పార్టీ కోసం కష్టపడిన వారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందనే బలమైన సంకేతాన్ని కేడర్ లోకి పంపడం ద్వారా ఎన్నికల సమరానికి శ్రేణులను సర్వసన్నద్ధం చేస్తున్నారు.
త్రిమూర్తుల వ్యూహం.. గులాబీ పార్టీకి చెక్ పెట్టేనా?
పరకాలలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావడమే ధ్యేయంగా హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామి రెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి అయూబ్ లతో కలిసి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి త్రిమూర్తుల్లా వ్యూహాలు రచిస్తున్నారు. జిల్లా నాయకత్వం నిరంతరం ఇక్కడి పరిణామాలపై నిఘా ఉంచి, క్షేత్రస్థాయిలో పార్టీకి బలమైన పునాది వేస్తోంది. మండల కమిటీల నియామకంతో ఇప్పటికే శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుండగా, రాబోయే కొద్ది రోజుల్లో తుది గ్రామ కమిటీల ప్రకటన కూడా వెలువడితే రానున్న స్థానిక సంస్థల పోరులో ప్రతిపక్షాలకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

