భద్రకాళి నిర్వాసితులకు మొదటి నెల జీతాలు
నగదు అందజేసిన కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి
ఉపాధి, ఆర్థిక భరోసా కల్పించడంపై లబ్ధిదారుల హర్షం
కాకతీయ, హనుమకొండ : భద్రకాళి దేవాలయ మాడవీధుల నిర్మాణం కోసం తమ భూములను స్వచ్ఛందంగా అప్పగించిన 17 నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగాల్లో చేరిన లబ్ధిదారులకు మొదటి నెల జీతాల పంపిణీ కార్యక్రమం మంగళవారం హనుమకొండలోని కుడా కార్యాలయంలో నిర్వహించారు. కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, పీవో అజిత్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు మొదటి నెల వేతన నగదును అందజేశారు. భద్రకాళి బండ్ అభివృద్ధి ప్రాజెక్టు నేపథ్యంలో నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం ఇప్పటికే న్యూ శాయంపేటలో డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించి, పట్టాలను పారదర్శకంగా అందజేసింది. అంతేకాకుండా, ప్రతి నిర్వాసిత కుటుంబంలో ఒకరికి భద్రకాళి బండ్ ప్రాజెక్టులో ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఉద్యోగంలో చేరిన లబ్ధిదారులు మొదటి నెల పూర్తి చేసుకోవడంతో ఈ వేతనాల పంపిణీ చేపట్టారు. ఇల్లు, ఉద్యోగంతో పాటు మొదటి నెల జీతం కూడా అందడంతో నిర్వాసిత కుటుంబాల సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

