కాలువ కోసం కట్ట ధ్వంసం!
కెనాల్ మరమ్మతులకు సాగర్ కట్టను తొలుస్తున్న కాంట్రాక్టర్
అనుమతులు లేకుండానే యథేచ్ఛగా మట్టి తోలకాలు
గత పర్మిషన్లనే సాకుగా చూపుతూ అధికారుల సాక్షిగా తవ్వకాలు
కట్టలు బలహీనపడితే తెగిపోతుందని రైతుల ఆందోళన
పలితంగా ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన
మాముళ్ల మత్తులో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు
కాంట్రాక్టర్‌తో కుమ్మక్కయ్యారంటూ రైతుల నుంచి విమర్శలు
ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంపై తలెత్తుతున్న అనుమానాలు
కాకతీయ, ఏన్కూర్ : ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాలలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలువ కట్టల మట్టి తోలకాలు యథేచ్ఛగా, బహిరంగంగానే కొనసాగుతున్నాయి. ఎలాంటి తాజా ప్రభుత్వ అనుమతులు లేవని ఒకవైపు సంబంధిత అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం కాంట్రాక్టర్లు దర్జాగా భారీ యంత్రాలను రంగంలోకి దించి మట్టి తవ్వకాలు సాగిస్తుండటం ఇక్కడి పరిపాలనా అస్తవ్యస్తతకు అద్దం పడుతోంది. పొలాలకు నీరందించే కాలువ కట్టలను ఇష్టారాజ్యంగా తొలిచేస్తుండటంతో భవిష్యత్తులో కట్టలు తెగి పంటలు మునిగిపోయే ప్రమాదం ఉందని తెలిసినా, అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతుండటంపై స్థానిక రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
పాత పర్మిషన్ల సాకుతో కొత్త దందా
ప్రస్తుతం మండలంలో సిరిపురం కెనాల్ కాలువ మరమ్మతు పనులు సాగుతున్నాయి. ఈ పనుల కోసమే తాము మట్టిని తరలిస్తున్నామని కాంట్రాక్టర్ వర్గాలు బుకాయిస్తున్నాయి. అయితే అసలు ట్విస్ట్ ఏమిటంటే.. ఒక కాలువ నిర్మాణం లేదా మరమ్మతు కోసం, కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన మరో ప్రధాన కాలువ కట్టను నిలువునా ధ్వంసం చేయడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అధికారులు ఈ అక్రమ తవ్వకాలను ప్రశ్నిస్తే.. కాంట్రాక్టర్ మాత్రం గతంలో ఎప్పుడో పొందిన పాత అనుమతుల పత్రాలను సాకుగా చూపుతూ కాలయాపన చేస్తున్నాడు. తాజా నిబంధనల ప్రకారం ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోయినా, పాత కాగితాలనే అడ్డుపెట్టుకుని లక్షల రూపాయల విలువైన మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు.
కుమ్మక్కైన రెవెన్యూ.. ఇరిగేషన్ అధికారులు
ఈ మొత్తం వ్యవహారంలో రెవెన్యూ మరియు ఇరిగేషన్ (నీటిపారుదల) శాఖల అధికారుల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కళ్ల ముందే జేసీబీలు, ట్రాక్టర్లతో కాలువ కట్టల రూపురేఖలు మారుస్తున్నా అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. కాంట్రాక్టర్ ఇచ్చిన ముడుపుల దెబ్బకు రెండు శాఖల అధికారులు పూర్తిగా నిద్రమత్తులో ఉన్నారని స్థానికులు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు. కాలువ కట్టలు బలహీనపడితే రాబోయే రోజుల్లో నీటి సరఫరా నిలిచిపోతుందని, తద్వారా వేలాది ఎకరాల ఆయకట్టు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, ఏన్కూర్‌లో సాగుతున్న ఈ అక్రమ మట్టి తోలకాలను తక్షణమే నిలిపివేసి, కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

