ప్రియుడే హంతకుడు!
లక్ష్మీపురం వివాహిత హత్య కేసును ఛేదించిన పోలీసులు
నిందితుడి అరెస్టు, రిమాండ్‌కు తరలింపు
: వివరాలు వెల్లడించిన ఏసీపీ
అక్షర సత్యమైన ‘కాకతీయ’ కథనం
కాకతీయ, నర్సంపేట : దుగ్గొండి మండలం లక్ష్మిపురం శివారులో జరిగిన వివాహిత తాళ్లపల్లి సుమలత హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మృతురాలి ప్రియుడే హంతకుడిగా తేలినట్లు నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ కేసుపై ముందుగా ‘కాకతీయ’ దినపత్రిక ప్రచురించిన కథనం అక్షర సత్యమైందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం… లక్ష్మిపురం గ్రామానికి చెందిన తాళ్లపల్లి సుమలత భర్త మహేందర్ మృతి చెందిన తర్వాత, ఆమె అదే గ్రామానికి చెందిన పాండవుల సురేష్‌తో గత ఐదేళ్లుగా సన్నిహిత సంబంధం కొనసాగించింది. వీరి వ్యవహారాన్ని గమనించిన గ్రామస్తులు సురేష్‌ను హెచ్చరించడంతో, సుమలత అతడిని దూరం పెట్టింది. ఈ క్రమంలో మూడు నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మరో వ్యక్తితో సుమలతకు పరిచయం ఏర్పడింది. ఈ విషయంపై సురేష్‌కు అనుమానం రావడంతో ఆమెను అనుసరిస్తూ హనుమకొండకు వెళ్లాడు. అక్కడ బస్టాండ్ సమీపంలోని యమునా లాడ్జి వద్ద మరో వ్యక్తితో కలిసి కనిపించడంతో ఆమెతో గొడవపడి కొట్టాడు. అప్పటి నుంచి సుమలత పూర్తిగా దూరంగా ఉండటంతో సురేష్‌లో తీవ్ర అసూయ పెరిగింది.
పథకం ప్రకారం.. గొంతు కోసి..
సుమలతను హత్య చేయాలని ముందుగానే నిర్ణయించుకున్న సురేష్, మే 20న హనుమకొండకు రావాలని ఆమెను పిలిచాడు. ఇద్దరూ యమునా లాడ్జిలో కలుసుకుని సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. అనంతరం వరంగల్ బస్టాండ్‌కు చేరుకున్న తర్వాత సురేష్ తన బైక్ తీసుకొచ్చి, కాశిబుగ్గ ప్రాంతంలో రోడ్డుపక్కన కత్తి కొనుగోలు చేశాడు. తర్వాత సుమలతను బైక్‌పై తీసుకొని లక్ష్మిపురం వైపు బయలుదేరిన సురేష్, గ్రామ శివారులోని ఎస్సారెస్పీ చిన్న కాలువ సమీపంలో బైక్ ఆపి మాట్లాడుకుందామని నమ్మించి లోపలికి తీసుకెళ్లాడు. అక్కడ చీకటి ప్రాంతంలో ఆమెకు అనుమానం రాకుండా మాట్లాడుతూనే తన వద్ద దాచుకున్న కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు విచారణలో భాగంగా నిందితుడి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకలు ఉన్న బట్టలు, మృతురాలి హ్యాండ్‌బ్యాగ్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితుడు పాండవుల సురేష్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన దుగ్గొండి సీఐ సాయి రమణ, ఎస్సై రణధీర్, కానిస్టేబుళ్లు కుమార స్వామి, రంజిత్‌లను ఏసీపీ అభినందించారు.

