మహిళలే ఆర్థికాభివృద్ధికి మూలస్తంభాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
8 వేల మహిళా సంఘ భవనాలకు వర్చువల్‌గా శంకుస్థాపన
ఇందిరమ్మ చీరల నూతన డిజైన్ల ఆవిష్కరణ
డిసెంబర్ 9 లోపు భవనాల నిర్మాణాలు పూర్తి కావాలి
కాకతీయ ఖమ్మం: మహిళలే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మూలస్తంభాలని, వారు సొంతంగా రాణించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 8 వేల మహిళా సంఘ భవనాల (వీఓ భవనాలు) నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే మహిళల కోసం రూపొందించిన నూతన డిజైన్ ఇందిరమ్మ చీరలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఖమ్మం కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, అదనపు కలెక్టర్ పి. శ్రీజ, మహిళా సంఘాల ప్రతినిధులు వర్చువల్‌గా హాజరయ్యారు.

మహిళలే బస్సుల యజమానులు..
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళా సంఘాల ద్వారా వెయ్యి బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన నడిపిస్తూ, మహిళలను బస్సుల యజమానులుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. తొలి విడతగా 500కు పైగా బస్సులను పరేడ్ గ్రౌండ్స్ నుండి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, రైస్ మిల్లులు, లాజిస్టిక్ పార్కులు, పెద్ద గోదాముల ఏర్పాటుకు మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తామన్నారు. మహిళల్లో వ్యాపార నైపుణ్యాలు పెంచేందుకు ‘వీ-హబ్’ ద్వారా శిక్షణ ఇస్తామన్నారు.
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
ప్రజల ఆరోగ్య రక్షణ కోసం మహిళా సంఘాలు సేంద్రియ, సహజ వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించాలని సీఎం పిలుపునిచ్చారు. పంట మార్పిడి విధానంపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న వీఓ భవనాలను ఈ ఏడాది డిసెంబర్ 9 లోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రభుత్వం తమ కోసం ఇందిరా మహిళా డైరీ, పెట్రోల్ బంక్‌లు, సోలార్ ప్లాంట్లు వంటి ఎన్నో అద్భుత పథకాలు అమలు చేస్తోందని ఖమ్మం జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధులు కొట్టే విజయలక్ష్మి, కృష్ణవేణి ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ శ్రీరామ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

