అంతా మా ఇష్టం!
ఆకునూర్ పల్లె దవాఖానలో సమయపాలన కరవు
రోగులపై ఆశ కార్యకర్త దురుసు ప్రవర్తన
చర్యలు తీసుకోవాలని అధికారులకు గ్రామస్తుల విజ్ఞప్తి
కాకతీయ, చేర్యాల : చేర్యాల మండలంలోని ఆకునూర్ పల్లె దవాఖానలో వైద్య సిబ్బంది తీరు “అంతా మా ఇష్టం… మమ్మల్ని అడిగేవారే లేరు” అన్నట్లుగా తయారైంది. సిబ్బంది సమయపాలన పాటించకపోవడంపై గ్రామంలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ వైద్యం కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ఉందని పాలకులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఆశయాలు నీరుగారుతున్నాయి. ఉదయం 9 గంటలకే వైద్యశాలకు చేరుకోవాల్సిన సిబ్బంది… మంగళవారం ఉదయం 10:30 గంటలైనా రాకపోవడంతో జ్వరాలు, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న రోగులు దవాఖాన ముందు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ప్రభుత్వ వైద్యం అందక, తప్పనిసరి పరిస్థితుల్లో పేద ప్రజలు ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయించి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
పరీక్షలు అడిగితే పరుష పదజాలం
సమయానికి రాకపోవడమే కాకుండా, ప్రశ్నించిన రోగులపై ఓ ఆశ కార్యకర్త మండిపడటం కలకలం రేపింది. రక్తపోటు, మధుమేహం పరీక్షలు చేయాలని రోగులు కోరగా… పరీక్షలు చేసే యంత్రాలు అందుబాటులో లేవని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ ఆమె దురుసుగా సమాధానమిచ్చినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తూ, రోగులపై దురుసుగా ప్రవర్తిస్తున్న సిబ్బందిపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులతో పాటు పోరండ్ల వెంకటేష్, కోతి దాస్, బాపు శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

