పల్లెల్లో ఇంటర్నెట్ విప్లవం
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సీఎం రేవంత్ వీసీ
భారత్‌నెట్ నిధుల విడుదలపై చర్చ
టీ-ఫైబర్ నెట్‌వర్క్ విస్తరణపై సుదీర్ఘ వివరణ
తొలి విడతగా మూడు జిల్లాల్లో 3,089 గ్రామాల్లో కనెక్టివిటీ
స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్
కాకతీయ,తెలంగాణ బ్యూరో : తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు నిరంతరం అంతరాయం లేని హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందించడమే లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భారత్‌నెట్ ప్రోగ్రాం సజావుగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలక అంశాలను కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దృష్టికి తీసుకెళ్లారు. ఐటీ, సమాచార శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రి సింధియాతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సుదీర్ఘంగా చర్చించారు. ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించి సాధ్యమైనంత త్వరగా ఒప్పందాన్ని కుదుర్చుకోవడం, కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను సత్వరం విడుదల చేయడం వంటి అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చర్చించారు.
రింగ్ ఆర్కిటెక్చర్ విధానం
రాష్ట్రంలో ఏకీకృత డిజిటల్ విధానం వల్ల టీ-ఫైబర్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తూ ప్రతి గ్రామ పంచాయతీని అనుసంధానించేలా రింగ్ ఆర్కిటెక్చర్‌గా తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఈ విధానం ద్వారా ఒక మార్గంలో నెట్‌వర్క్‌కు అంతరాయం ఏర్పడినా, ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ఇంటర్నెట్ సేవలు నిరంతరం కొనసాగుతాయి. మండలం నుండి గ్రామ పంచాయతీ వరకు ఉండే రింగ్ నెట్‌వర్క్ వ్యవస్థలను డిజిటల్ భారత్ నిధికి బదిలీ చేయడంపై స్పష్టమైన విధానం ఉండాలని ముఖ్యమంత్రి కోరగా, కేంద్ర మంత్రి సింధియా దీనిపై సానుకూలంగా స్పందించి, కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా తెలంగాణ ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనుంది.
మొదటి దశలో 3,089 గ్రామాలు
తొలి విడతలో భాగంగా గతంలో నెట్‌వర్క్ దెబ్బతిన్న ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని 3,089 గ్రామాలకు డిజిటల్ కనెక్టివిటీని తక్షణమే పునరుద్ధరిస్తారు. భారత్‌నెట్ ప్రోగ్రామ్ కింద గ్రామాలను అనుసంధానిస్తూనే, భవిష్యత్తు అవసరాలకు సరిపడేలా అత్యుత్తమ ఫైబర్ నెట్‌వర్క్ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా నగర ప్రాంతాలతో సమానంగా పల్లెల్లోనూ సేవలు అందించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి నాణ్యమైన హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే తెలంగాణ దార్శనికతను సాధించడానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని సింధియా స్పష్టం చేశారు. ఈ ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి. అజిత్ రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ డి. అనుదీప్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

