పిల్లల సమస్యల పరిష్కారానికి సమిష్టి కృషి అవసరం..
కాకతీయ, హనుమకొండ : ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా హనుమకొండ ఐడీఓసీ సముదాయంలో శనివారం స్నేహ బాలికల పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని 12 మండలాల నుంచి స్నేహ బాలికలు, ఉల్లాస్ అభ్యాసకురాళ్లు, స్వచ్ఛంద కార్యకర్తలు, మహిళా సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. బాలల పార్లమెంట్‌లో స్నేహ సంఘాల పురోగతి, బాలల భద్రత, విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం, రవాణా, సాధికారత వంటి అంశాలపై బాలికలు చర్చించి తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు. గ్రామాలు, పాఠశాలలు, సమాజంలో ఎదురవుతున్న సమస్యలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. బాలల హక్కుల పరిరక్షణ, విద్యాభివృద్ధి, సురక్షిత వాతావరణం కల్పనలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బాలికలు కోరారు. అధికారులు వారి సూచనలను శ్రద్ధగా విని, అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి, మహిళా-శిశు సంక్షేమ, పంచాయతీ, వైద్య-ఆరోగ్య, విద్యాశాఖ అధికారులు, పోలీసు శాఖ ప్రతినిధులు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు. సమాజ అభివృద్ధిలో బాలల భాగస్వామ్యం కీలకమని అధికారులు పేర్కొంటూ బాలికలను అభినందించారు.

