ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ ప్రత్యేక నిఘా
: హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు, కుడాచైర్మన్ వెంకట్రామ్ రెడ్డి
హైదరాబాద్ ఇందిరా భవన్లో ఏఐసీసీ, టీపీసీసీ అగ్రనేతల కీలక సమీక్ష
సెక్యులర్ ఓట్ల తొలగింపు జరుగుతోందని మహేష్ కుమార్ గౌడ్ ఆందోళన
బూత్ స్థాయి నుంచి పార్టీ వ్యవస్థ బలోపేతం, అక్రమాలపై నిరంతర పర్యవేక్షణే లక్ష్యం
కాకతీయ, వరంగల్ బ్యూరో: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయనే అనుమానాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించిందని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, వరంగల్ కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ సంయుక్త ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏ), సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్లు (ఎస్ఎస్ఏ)లతో నిర్వహించిన కీలక సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి మూడు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా వర్గీకరించి నిర్వహించిన ఈ సదస్సుకు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, వివిధ జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎస్ఎస్ఏ కోఆర్డినేటర్లు, రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు హాజరయ్యారు.
సెక్యులర్ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఓట్ల తొలగింపు!
ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకంగా పరిగణిస్తోందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సెక్యులర్ (లౌకికవాద) ఓటర్లను లక్ష్యంగా చేసుకుని, అర్హులైన వారి ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించే ప్రక్రియ సాగుతోందనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బూత్ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని నాయకులు వివరించారు. కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, ఓట్ల బదిలీ వంటి ప్రక్రియల్లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా బూత్ స్థాయి ఏజెంట్లు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా, అనర్హుల ఓట్లను తొలగించేలా కాంగ్రెస్ శ్రేణులు ప్రత్యేక నిఘా ఉంచాలని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

