ఎట్టకేలకు ఏనుమాముల పాలకవర్గం ఖరారు!
గత ఏడాది ప్రకటించిన కమిటీకే సర్కారు మొగ్గు
చైర్‌పర్సన్‌గా యార ప్రియాంకకే దక్కిన అవకాశం
తాజాగా ప్రకటించిన సీఎం రేవంత్ ప్రభుత్వం
పనిలో పనిగా మార్కెట్ కార్యదర్శి మార్పు
కొత్త కార్యదర్శిగా ఎన్.శ్రీనివాస్ నియామకం

కాకతీయ, వరంగల్ : ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ అధికార, పాలనాపరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఎప్పుడెప్పుడా అని రైతులు, అధికార పార్టీ నాయకులు ఎదురుచూస్తున్న పాలకవర్గం ఎట్టకేలకు ఖరారైంది. గతంలో ప్రకటించిన కమిటీకే ప్రభుత్వం మొగ్గుచూపింది. పనిలోపనిగా మార్కెట్ కార్యదర్శిని సైతం మార్చేసింది. ఇప్పుడున్న మార్కెట్ కార్యదర్శిని సొంతగూటికి పంపించి, కొత్త కార్యదర్శిని నియమించింది. గతంలో పనిచేసిన పాలకవర్గం కాలపరిమితి 2023 ఆగస్టు 16న ముగిసింది. ఆ సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం, సాధారణ ఎన్నికలు దగ్గర పడడడంతో కొత్త పాలకవర్గంపై ఆ ప్రభుత్వం దృష్టిసారించలేకపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకనైనా నూతన కమిటీని నియమిస్తారని అందరూ ఆశగా ఎదురుచూశారు. పలువురు అధికార పార్టీ నాయకులు జోరుగా పైరవీలు కూడా చేశారు. చివరకు గత ఏడాది జనవరి 28న ఏనుమాముల మార్కెట్ కు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త కమిటీని నియమించింది. చైర్పర్సన్ గా యార ప్రియాంక పేరును ప్రకటించింది. మరో 13మందిని సభ్యులుగా కమిటీని వెల్లడించింది. అయితే, అధికార పార్టీ నాయకుల్లో విభేదాల కారణంగా కమిటీ నియామకాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. తిరిగి, ఏడాదిన్నర తర్వాత మళ్లీ ప్రియాంక కమిటీనే నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మూడేండ్లుగా ఎదురుచూస్తున్న కమిటీ నియామకం చేపట్టడం గమనార్హం. అయితే, ఈసారైనా కమిటీ ప్రమాణ స్వీకారం జరుగుతుందా? మళ్లీ ఏవైనా రాజకీయ శక్తులు అడ్డుకుంటాయా? అనే అనుమానాలు లేకపోలేదు.
కొత్త కార్యదర్శి నియామకం!
ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద మార్కెట్ గా పేరొందిన ఏనుమాముల మార్కెట్ కు మూడేళ్లుగా కమిటీయే లేదంటే.. రెండేళ్లుగా ఇన్ చార్జ్ కార్యదర్శులతోనే కాలం వెళ్లదీసింది ప్రభుత్వం, తాజాగా, పాలకవర్గాన్ని ప్రకటించిన ప్రభుత్వం పనిలో పనిగా ఫుల్‌చార్జ్ మార్కెట్ కార్యదర్శిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. షాద్ నగర్ మార్కెట్ కార్యదర్శి ఎన్.శ్రీనివాస్ ను ఏనుమాముల కార్యదర్శిగా నియమించింది. తొలుత సాధారణ బదిలీల్లో సిరిసిల్ల మార్కెట్ కు బదిలీ అయిన శ్రీనివాస్ ను రెండు రోజుల వ్యవధిలోనే ప్రమోషన్ కల్పిస్తూ వరంగల్ మార్కెటు బదిలీ చేయడం గ


మనార్హం. మొత్తంగా పాలకవర్గం, కొత్త కారదర్శి నియామకంతో మార్కెట్ కు మంచిరోజులు రానున్నాయా? అనే చర్చ జరుగుతోంది. త్వరలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుండడం, కొత్త పాలకవర్గం రైతుల శ్రేయస్సు కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని అంతా ఎదురుచూస్తున్నారు. అసలే ఈసారి వర్షాలు ఆశించిన స్థాయిలో పడకపోవచ్చని వాతావరణ శాఖ ప్రకటిస్తున్న నేపథ్యంలో ఖరీఫ్ సాగుకు రైతులను పాలకవర్గం ఏమేరకు సన్నద్ధం చేస్తుందనేది వేచిచూడాల్సిందే..!
రైతుల గురించి తెలుసా?
వ్యవసాయ మార్కెట్ అంటే రైతులు, వ్యాపారులతో సత్సంబంధాలు ఉంటాయి. వివిధ రకాల పంటలను రైతులు మార్కెట్ కు తీసుకొస్తుంటారు. వ్యాపారులు ఆ పంటలను కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలో పంటల ధరలు, సరుకుల తూకం, ధరల నిర్ణయం విషయంలో కొన్ని సందర్భాల్లో మార్కెట్ లో నిరసనలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మార్కెట్ పాలకవర్గం, అధికారులు సమన్వయంతో రైతులు, వ్యాపారుల మధ్య సయోధ్య కుదిరించాల్సి ఉంటుంది. రైతుల కష్టాన్ని అంచనా వేయడం, ధరవరలపై సరైన నిర్ణయం తీసుకోవాలంటే ముందుగా వ్యవసాయం, అందులో కష్టనష్టాలు స్వయంగా అనుభవించిన వారైతేనే సమస్యలను సులువుగా పరిష్కరించే అవకాశం ఉంటుందనేది అందరి అభిప్రాయం. మరి కొత్త చైర్పర్సన్ గా ఎంపికైన యార ప్రియాంకకు రైతులు, వ్యవసాయం పట్ల అవగాహన ఉందా? అనే చర్చ జరుగుతోంది. లేదంటే.. మార్కెట్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. రైతు బిడ్డ అనో, రైతు కుటుంబం నుంచి వ్యక్తులనో అతిపెద్ద మార్కెట్ వ్యవస్థను అప్పగిస్తే.. రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలం గడిచేకొద్దీ పాలకవర్గం పనితీరు ఏపాటిదో అర్ధమవుతుందని, అప్పటివరకు వేచిచూడాల్సిందేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

