అకాల వర్షానికి ఇల్లు ధ్వంసం..
ఈదురుగాలులకు విరిగిపడ్డ చెట్టు
కాకతీయ, జూలూరుపాడు : జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామ పంచాయతీలో మంగళవారం రాత్రి వీచిన ఈదురుగాలులు, అకాల వర్షానికి భారీ చింతచెట్టు కూలి సిరికొండ లక్ష్మి అనే వృద్ధురాలి నివాసం పూర్తిగా ధ్వంసమైంది. ఈ దుర్ఘటన గురించి తెలుసుకున్న వెంటనే వినోబానగర్ సర్పంచ్ గంగావత్ నవీన్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో నష్టాన్ని పరిశీలించి బాధిత వృద్ధురాలిని ఓదార్చారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆమె దీనస్థితిని చూసి చలించిన సర్పంచ్ గంగావత్ నవీన్, కాంగ్రెస్ నాయకులు కలిసి ఆమెకు తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రభుత్వం కూడా స్పందించి బాధితురాలిని త్వరగా ఆదుకోవాలని సర్పంచ్ కోరారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచినందుకు లక్ష్మి కన్నీటిపర్యంతమై కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

