ప్లాస్టిక్ మానవ మనుగడకు ప్రమాదకరం
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలి
తడి, పొడి చెత్త వర్గీకరణతోనే పారిశుధ్యం మెరుగు
రాంపూర్ గ్రామసభలో డీఎల్‌పీఓ వేదవతి
కాకతీయ, గీసుగొండ : నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకం మానవ మనుగడతో పాటు పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తుందని డివిజనల్ పంచాయతీ అధికారి (డీఎల్‌పీఓ) వేదవతి తెలిపారు. మండలంలోని రాంపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ రడం భరత్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన డీఎల్‌పీఓ వేదవతి మాట్లాడుతూ.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసి, పర్యావరణహిత వస్తువులను మాత్రమే ఉపయోగించాలని ప్రజలకు సూచించారు. ప్లాస్టిక్ వల్ల నేల, నీరు, గాలి కాలుష్యానికి గురవడమే కాకుండా మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. గ్రామాల్లో తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్తను వేర్వేరుగా సేకరించడం ద్వారానే పారిశుధ్యాన్ని మెరుగుపర్చవచ్చని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రడం భరత్ కుమార్ మాట్లాడుతూ.. రాంపూర్ గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత, స్వచ్ఛమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు స్థానికులంతా భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, నర్సరీ, డంపింగ్ యార్డ్, వైకుంఠధామాన్ని పరిశీలించి నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

