గ్రామాల అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
మహిళల ఆర్థిక సాధికారతపై ప్రత్యేక దృష్టి
సేంద్రీయ సాగుతో ఆరోగ్యం, ఆదాయం
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
కాకతీయ, దుగ్గొండి : గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, మహిళలు ఆర్థికంగా బలోపేతమై కోటీశ్వరులుగా ఎదగడానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మండలంలోని మహ్మదాపురం, మర్రిపల్లి, మల్లంపల్లి, గుడిమహేశ్వరం గ్రామాల్లో గ్రామ ఐక్య మహిళా సంఘాల భవనాలు, మల్లంపల్లిలో ఎస్సీ కమ్యూనిటీ హాల్, మర్రిపల్లిలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు ఆయన భూమిపూజ చేశారు. అనంతరం 99వ రోజు ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి మహిళా సంఘం కోట్ల రూపాయల వ్యాపారాలు నిర్వహించే స్థాయికి ఎదగాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో నిత్యావసర వస్తువులు కలుషితమై ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లోనే సేంద్రీయ పద్ధతుల్లో పంటలు పండిస్తూ, పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడం ద్వారా ఆరోగ్యం, ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ రాంరెడ్డి, తహసీల్దార్ ముస్కు సమ్మక్క, ఎంపీడీఓ లెక్కల అరుంధతి, సర్పంచులు బూర రాధిక హేమచందర్, డ్యాగం సుజాత సుధాకర్, గోగుల శ్రీనివాస్ రెడ్డి, కూరతోట స్వప్న సురేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు చుక్క రమేష్ తదితరులు పాల్గొన్నారు.

