అక్రమ ఇసుక నిల్వలపై అధికారుల దాడులు
92 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేసిన తహసీల్దార్ నరేష్
కాకతీయ, నెల్లికుదురు: రామన్నగూడెం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 92 ట్రాక్టర్ల ఇసుకను అధికారులు సీజ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం తహసిల్దార్ సిహెచ్ నరేష్ వివరాలు వెల్లడించారు. రామన్నగూడెంలో అక్రమ నిల్వలు ఉన్నాయనే సమాచారంతో గురువారం ఆర్ఐ రామకృష్ణ, ఎస్సై చిర్ర రమేష్ బాబులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని తెలిపారు. స్థానిక గ్రామ పెద్దలు, సాక్షుల సమక్షంలో పంచనామా నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 92 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సీజ్ చేసిన ఇసుకను బహిరంగ వేలం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి జమ చేయడానికి వీలుగా జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపినట్లు వెల్లడించారు. మండలంలో అక్రమ ఇసుక తవ్వకాలు, నిల్వలపై నిఘా కొనసాగుతుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే మైనింగ్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

