మళ్లీ వచ్చేది బీఆర్ఎస్సే
వచ్చే ఎన్నికల్లో 100 సీట్లతో గెలుపు
కాంగ్రెస్, బీజేపీల కుట్రలను తిప్పికొడతాం
ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి: మాజీ మంత్రి ఎర్రబెల్లి
పాలకుర్తిలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్పై శిక్షణ
కాకతీయ, జనగామ : రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని, 100 సీట్లతో తిరిగి అధికారంలోకి రావడం తథ్యమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధీమా వ్యక్తం చేశారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కోలుకొండ గ్రామంలో పాలకుర్తి నియోజకవర్గ స్థాయి ఎస్ఐఆర్ మరియు సభ్యత్వ నమోదు శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి మాయామాటలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే బీఆర్ఎస్ పాలన మళ్లీ వస్తుందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. “ప్రతి బూత్ కన్వీనర్, ఆఫీసర్ తమ పరిధిలోని ఓటర్లతో నిరంతరం మమేకం కావాలి. మన బూత్ – మన బాధ్యతగా ఓట్ల సవరణ ప్రక్రియలో పాల్గొనాలి. ముఖ్యంగా నాన్-లోకల్ ఓటర్లను గుర్తించి, వారి సమస్యలను పరిష్కరిస్తూ పార్టీకి లాభం చేకూర్చేలా చూడాలి” అని ఆయన దిశానిర్దేశం చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మహిళలను కూడా భాగస్వామ్యం చేయాలని సూచించారు.

నాయకుల సమన్వయం – ప్రజలతో మమేకం
గ్రామస్థాయిలో సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు అందరూ కలిసి పనిచేయాలని ఎర్రబెల్లి కోరారు. గ్రామ ఇంచార్జీలు ప్రతిరోజూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని చెప్పారు. “గతంలో పదవులు అనుభవించిన వారు ఓపికగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోవాలి. పార్టీ కోసం 15 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి పోరాడాను, జైలుకు కూడా వెళ్లాను. కార్యకర్తలు కూడా అంతే ధైర్యంతో ముందుకు సాగాలి” అని ఆయన ఉద్ఘాటించారు.
నియోజకవర్గ స్థాయిలో ఘనంగా శిక్షణ
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, అరూరి రమేశ్, బీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ వై. సతీష్ రెడ్డి, శ్రీపాద రామ్, సుధీర్ కుమార్ తదితర ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 06 మండలాల నుంచి వచ్చిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఈ శిక్షణ తరగతుల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పార్టీ శ్రేణులు చొరవ చూపాలని, క్రమశిక్షణతో కూడిన రాజకీయాలతో ప్రజల మద్దతును మళ్లీ సాధించుకోవాలని నేతలు పిలుపునిచ్చారు.

