రైతుల భూములకు రక్షణ కల్పించాలి
ఐటీడీఏ పీఓకు బాధితుల వినతి
ఆకలవారి గణపురంలో భూముల కబ్జాపై ఆందోళన
కాకతీయ, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని ఆకలవారి గణపురం గ్రామ పరిధిలో తమ భూములను అక్రమంగా కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు సోమవారం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారికి వినతిపత్రం సమర్పించారు. 1965 సంవత్సరం నుంచి తాము సాగు చేసుకుంటున్న భూములకు రక్షణ కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాచర్ల వెంకటేశ్వర్లు, ఫయాజ్, కొప్పుల శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ సర్వే నంబర్ 209లో ఉన్న తమ భూములపై కొందరు వ్యక్తులు దౌర్జన్యానికి దిగుతున్నారని తెలిపారు. పలక గంగ, బొల్లం సారయ్య, గొంది గౌరమ్మ, శమంతకమణి వంటి వ్యక్తులతో పాటు, ఒక ఐటీడీఏ ఉద్యోగిని (బడే సులోచన) అండదండలతోనే భూ కబ్జాలు జరుగుతున్నాయని ఆరోపించారు. చుట్టుపక్కల మండలాల నుంచి గిరిజనులను రప్పించి, గుడిసెలు, షెడ్లు వేసి భూములు తమవేనని దౌర్జన్యం చేస్తున్నారని వారు వాపోయారు.
న్యాయం చేయాలని వేడుకోలు
తాము ఈ భూములను నమ్ముకొనే జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు ఈ అక్రమ కబ్జాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు. ఐటీడీఏ కార్యాలయం ఎదుట రైతులు తమ ఆవేదనను వ్యక్తపరుస్తూ, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అక్రమ ఆక్రమణలను అరికట్టాలని డిమాండ్ చేశారు. తమకు ప్రభుత్వం కేటాయించిన భూములకు భద్రత కల్పించి, న్యాయం చేయాలని ఐటీడీఏ పీఓను కోరారు. తక్షణమే స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

