రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచిన దానే రమేశ్
కాకతీయ, వేములవాడ: వేములవాడ పట్టణ శివారులోని జయవరం వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ జిల్లా రేకుర్తి గ్రామానికి చెందిన యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రేకుర్తి గ్రామానికి చెందిన దానే రమేశ్ (30) తాపీ మేస్త్రీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం రమేశ్ తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, వేములవాడ శివారులోని జయవరం వద్ద ఎదురుగా వచ్చిన టాటా ఏస్ వాహనం అత్యంత వేగంగా వచ్చి అతని వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమేశ్, తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, నిందితుడైన డ్రైవర్ వివరాలు సేకరించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. యువకుడి మృతితో రేకుర్తి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

