విద్యార్థులకు అమావాస్య గండం..!
* ఖాళీగా కనిపించిన తరగతి గదులు
* ఉపాధ్యాయులు ఫుల్ – విద్యార్థులు నిల్
* తొలిరోజు విద్యార్థుల హాజరు సన్నగిల్లింది
కాకతీయ,చేర్యాల: వేసవి సెలవుల అనంతరం సోమవారం పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ, అమావాస్య ప్రభావం విద్యార్థుల హాజరుపై కనిపించింది. అమావాస్య రోజున కొత్త కార్యక్రమాలు ప్రారంభించడం శుభకరం కాదనే సాంప్రదాయ నమ్మకంతో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను తొలి రోజు పాఠశాలకు పంపలేదు.దీంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం ఆశించిన మేర నమోదుకాలేదు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ, తరగతి గదులు పూర్తిస్థాయిలో నిండలేదు.
ఖాళీ బెంచ్ లతో దర్శనమిచ్చింన తరగతి గదులు
అమావాస్య ప్రభావం పాఠశాలలపై స్పష్టంగా కనిపించింది. పలు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో పాఠశాలలకు హాజరైనా, విద్యార్థుల సంఖ్య మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించలేదు. అమావాస్య సందర్భంగా కుటుంబ సంప్రదాయాలు, ప్రత్యేక పూజలు, ఇతర వ్యక్తిగత కారణాల వల్ల అనేక మంది విద్యార్థులు పాఠశాలలకు రాలేదు. దీంతో కొన్ని పాఠశాలల్లో తరగతి గదులు ఖాళీగా దర్శనమిచ్చాయి.విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావాలని, మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.
పరిస్థితి ఒకటి రెండు రోజుల్లో సాధారణ స్థితికి చేరుకుంటుందని స్థానిక పలు ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తెలిపారు.
పలు ప్రభుత్వ పాఠశాలలో హాజరు శాతం జీరో
అమావాస్య నేపథ్యంలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పూర్తిగా పడిపోయింది. కొన్ని పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా హాజరు కాకపోవడంతో జీరో అటెండెన్స్ నమోదైంది. ఉపాధ్యాయులు విధులకు హాజరైనప్పటికీ తరగతి గదులు ఖాళీగా కనిపించాయి.
గ్రామీణ ప్రాంతాల్లో అమావాస్య రోజున పిల్లలను పాఠశాలకు పంపకూడదనే సంప్రదాయ నమ్మకాల ప్రభావంతోనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల గైర్హాజరుతో బోధన కార్యక్రమాలకు అంతరాయం కలిగింది. విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు హాజరయ్యేలా తల్లిదండ్రులు సహకరించాలని ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు కోరుతున్నారు.
తొలి రోజు అడ్మిషన్లు శూన్యం
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ తొలి రోజు అమావాస్య కావడంతో విద్యార్థుల ప్రవేశాలు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. చాలా పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, కొత్తగా చేరిన విద్యార్థుల సంఖ్య శూన్యంగా ఉండటంతో విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు.
పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులను సంప్రదిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు మరియు ఇతర సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. రానున్న రోజుల్లో అడ్మిషన్ల సంఖ్య పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
భైర నరేందర్
– ఎంఈఓ (మండల విద్యాశాఖ అధికారి)*
విద్యా సంవత్సరం ప్రారంభమైన తొలి రోజు అడ్మిషన్లు నమోదు కాకపోయినా, ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రచారం నిర్వహించి విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో అడ్మిషన్ల సంఖ్య పెరుగుతుందని ఆశిస్తున్నాం.


