ఎరువుల దుకాణాలపై ఆకస్మిక దాడులు
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు పట్టణంలో ఎరువుల దుకాణాలపై పోలీసులు ప్రత్యేక ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డీసీఆర్‌బీ డీఎస్పీ ఈ. కిషోర్ బాబు ఆధ్వర్యంలో, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ కుమారస్వామి, ఎస్‌ఐ చంద్రశేఖర్ మరియు పోలీసు సిబ్బంది కలిసి ఈ తనిఖీలు చేపట్టారు. తనిఖీల సమయంలో ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, లైసెన్సులు, విక్రయ రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. రైతులకు నాణ్యమైన ఎరువులు మాత్రమే అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అధికారులు దుకాణ యజమానులకు స్పష్టమైన సూచనలు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయించాలని, అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలు వసూలు చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎస్పీ కిషోర్ బాబు మాట్లాడుతూ రైతులు ఎరువులు కొనుగోలు సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని సూచించారు. ఏవైనా అక్రమాలు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు వెల్లడించారు.

