అడతాం.. ఆడిస్తాం.. ఆపేదెవరు
ఏటూరునాగారం ఏజెన్సీ పల్లెల్లో పత్తాలాట జోరు
పక్కా నెట్‌వర్క్‌తో దందా..యువతే నిర్వాహాకుల టార్గెట్
సిండికేట్‌గా కొనసాగుతున్న పేకాట నిర్వహణ
ఎస్కార్ట్ టీంలతో నిఘా.. కూలిపోతున్న కుటుంబాలు
అధికారుల ఉదాసీనతపై విమర్శలు
కాకతీయ, నిఘా ప్రతినిధి : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో పేకాట దందా రోజురోజుకూ విస్తరిస్తోందన్న ఆరోపణలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. పల్లెలను కేంద్రంగా చేసుకుని పక్కా నెట్‌వర్క్‌తో పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మండల కేంద్రంతో పాటు ముళ్లకట్ట, రాంనగర్, శంకర్రాజ్పల్లి, రోయ్యూర్, ఓడవాడ, గోదావరి కరకట్ట పరిసరాలు, ముళ్లకట్ట–రాంపూర్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పేకాట గేమ్‌లు కొనసాగుతున్నట్లు సమాచారం. ఒక్కో గేమ్‌లో వేల నుంచి లక్షల రూపాయల వరకు చేతులు మారుతుండగా నిర్వాహకులు కమిషన్ల రూపంలో భారీగా సొమ్ము చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. మండలంలోని వివిధ గ్రామాలతో పాటు సమీప మండలాల నుంచి కూడా జూదరులు ఇక్కడికి తరలివస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు జూదరులపై ఉదాసీనత కనబరుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పాఠశాల పక్కనే పేకాట అడ్డాలు
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలోనే మూడు పేకాట అడ్డాలను ఏర్పాటు చేసి బహిరంగంగానే గేమ్‌లు నిర్వహిస్తున్నట్లు స్థానికుల నుండి తెలుస్తున్న సమాచారం. అలాగే ఓడవాడలోని గోదావరి కరకట్ట సమీపంలోని గుడిసెలు, రాంనగర్ కరకట్ట ప్రాంతం, ముళ్లకట్ట–రాంపూర్ సరిహద్దు ప్రాంతాలు పేకాట కేంద్రాలుగా మారినట్లు సమాచారం. రోజువారీగా పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరుగుతున్నప్పటికీ అరికట్టే చర్యలు కనిపించడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.
సిండికేట్ స్కెచ్.. టార్గెట్ యువతే
పేకాట నిర్వహిస్తున్న వారిలో కొందరు సిండికేట్‌గా ఏర్పడి మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు సమాచారం. ఎవరిని ఆటలోకి దింపాలి.. ఎవరిని పిలవాలి.. ఎక్కడ గేమ్ నిర్వహించాలి.. అనే అంశాలను ముందుగానే ప్రణాళిక ప్రకారం అమలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆర్థికంగా కొంత స్థోమత ఉన్న వ్యక్తులు, వ్యాపారులు, యువకులను లక్ష్యంగా చేసుకుని మొదట చిన్న మొత్తాలతో ఆటకు అలవాటు చేసి తర్వాత భారీ పందేల్లోకి దింపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాళ్లే పిలుస్తారు.. వాళ్లే ఆడిస్తారు.. చివరకు అప్పుల ఊబిలోకి నెట్టేస్తారు” అనే చర్చ మండల వ్యాప్తంగా సాగుతోంది. నిర్వాహకులు ప్రతి గేమ్‌పై కమిషన్లు వసూలు చేస్తూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారనే ప్రచారం మండల వ్యాప్తంగా జోరుగా కొనసాగుతుంది.
ఎస్కార్ట్ టీంలతో నిఘా.. కూలిపోతున్న కుటుంబాలు
పోలీసుల కదలికలను ముందుగానే తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఇన్ఫార్మర్లు, ఎస్కార్ట్ టీంలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. పేకాట స్థావరాలకు దూరంగా కాపలా వ్యక్తులను ఉంచి, ఎవరైనా కొత్త వ్యక్తులు లేదా పోలీసులు వస్తే వెంటనే నిర్వాహకులకు సమాచారం చేరేలా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. జూదరులకు మద్యం, సిగరెట్లు, గుట్కాలు, భోజన సదుపాయాలు కల్పిస్తూ గేమ్‌లు నిరంతరాయంగా కొనసాగించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ జూద వ్యసనానికి యువత ఎక్కువగా బలవుతుండటంతో అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును పేకాటలో కోల్పోయి అప్పుల పాలవుతున్న ఘటనలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, మండలంలో కొనసాగుతున్న పేకాట స్థావరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

