మరోసారి ముల్కీ ఉద్యమం తప్పదు
ప్రభుత్వానికి బీఆర్ఎస్ నేతల హెచ్చరిక!
మూడేళ్లు బీటెక్ చదివితే స్థానికులు ఎలా అవుతారు?
కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి. దేవీప్రసాద్
ఉద్యోగుల సభలో పీఆర్సీ, డీఏలపై సీఎం దాటవేత ధోరణి : భుజంగరావు
కాకతీయ, హైదరాబాద్ : రాష్ట్రంలో స్థానికత నిబంధనల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మరోసారి ముల్కీ ఉద్యమం వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి. దేవీప్రసాద్, బీఆర్ఎస్ నేత భుజంగరావు మాట్లాడారు. ఈ సమావేశంలో టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్, బీసీ కమిషన్ మాజీ సభ్యురాలు ఉపేంద్ర చారి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జి. దేవీప్రసాద్ మాట్లాడుతూ.. తెలంగాణలో కేవలం 3 ఏళ్లు బీటెక్ చదివినంత మాత్రాన ఇతర రాష్ట్రాల వారిని స్థానికులుగా ఎలా గుర్తిస్తారని ప్రశ్నించారు. పల్లా నిషాంత్ కేసులో వచ్చిన కోర్టు తీర్పు వల్ల తెలంగాణ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. తాము న్యాయస్థానం తీర్పును తప్పుబట్టడం లేదని, అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోర్టులో సరైన వాదనలు వినిపించడంలో మరియు కౌంటర్ దాఖలు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఇలాంటి సాంకేతిక లోపాల వల్ల గతంలో ఆదిలాబాద్, కొమరం భీం వంటి వెనుకబడిన జిల్లాల యువత ఉద్యోగాలు కోల్పోయారని గుర్తుచేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు దక్కేలా కఠిన నిబంధనలు తెచ్చిందని, 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు చదివిన వారినే స్థానికులుగా గుర్తించేలా నిర్ణయం తీసుకుందని తెలిపారు. తెలంగాణ పౌరులు ఇతర రాష్ట్రాల్లో చదివితే అక్కడ స్థానికులుగా గుర్తించనప్పుడు, ఇక్కడ మాత్రం నిబంధనలు సడలించడం ఏంటని నిలదీశారు. ఇప్పటికైనా సాధారణ పరిపాలన శాఖ అధికారులు, చీఫ్ సెక్రటరీ సమావేశమై దీనిపై గట్టి న్యాయపోరాటం చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగులను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
ఉద్యోగ సంఘాల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగంపై ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, కానీ సీఎం వారిని తీవ్రంగా నిరాశపరిచారని దేవీప్రసాద్ విమర్శించారు. నిన్నటి సభలో కొత్త పీఆర్సీ గురించి ఎలాంటి చర్చ లేదని, పెండింగ్లో ఉన్న 6 డీఏలలో కనీసం ఒకటి రెండు ఇస్తారని ఆశించినా ఇవ్వలేదని మండిపడ్డారు. సీపీఎస్ రద్దు గురించి సీఎం మాట్లాడకుండా దాటవేశారని ఆరోపించారు. నెలకు మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నామనే సాకుతో ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను పక్కనబెట్టారని, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి మరియు భూభారతి ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. కేవలం తనను ‘అన్న’ అని పిలిపించుకుంటే సరిపోదని, డిమాండ్లు నెరవేరిస్తే ఉద్యోగులే గుర్తిస్తారని హితవు పలికారు.
27 వేల ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు కుట్ర!
బీఆర్ఎస్ నేత భుజంగరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ విద్య కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. నాడు కేసీఆర్ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తే, నేడు రేవంత్ రెడ్డి రూ. 250 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు కడతామనే సాకుతో రాష్ట్రంలోని 27,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల దాదాపు 85,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన స్కూళ్లకు కేవలం రంగులు వేసి, తామే కట్టామని కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. ఉన్న పాఠశాలలను బాగు చేయకుండా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.

