రూ.7కోట్లతో భవన నిర్మాణ పనులు
ఇనుగుర్తి హైస్కూల్ అభివృద్ధికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర చొరవ
సాయి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భూమిపూజ
కాకతీయ, ఇనుగుర్తి: ఇనుగుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ. 7 కోట్ల అంచనా వ్యయంతో నూతన భవనాలు, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు శుక్రవారం ఘనంగా భూమిపూజ చేశారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రత్యేక కృషితో ఈ నిధులు మంజూరయ్యాయి. ఇందులో రూ. 1 కోటి ఎంపీ రవిచంద్ర ఎంపీలాడ్స్ నిధులు కాగా, ఆయన సిఫారసుతో పెట్రోలియం, సహజవాయువు కంపెనీల సహకారంతో సాయి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరో రూ. 6 కోట్లను ఈ ప్రాజెక్టు కోసం కేటాయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రవిచంద్ర సోదరుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నేత వద్దిరాజు కిషన్ పాల్గొనగా, సాయి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ట్రస్ట్ ప్రతినిధి రవీందర్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ తమ్మడపల్లి కుమార్ మాట్లాడుతూ, ఎంపీ రవిచంద్ర సహకారంతో ఇనుగుర్తి పాఠశాల ఆధునిక వసతులతో రూపుదిద్దుకోనుండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ దీకొండ వెంకన్న గౌడ్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో బండారి పార్థసారథి, ఎస్సై గంగారపు కరుణాకర్, ఇన్చార్జి హెచ్ఎం అమ్మ యాకయ్య, ఉప సర్పంచ్ యాదగిరి, వార్డు సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు బైరు అశోక్ గౌడ్, కూరెల్లి సతీష్, బొబ్బిలి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

