కుడా భూములపై తప్పుడు ప్రచారం
దమ్ముంటే బహిరంగ చర్చకు రా
కేటీఆర్ కనుసన్నల్లోనే కుడా నిధుల్లో రూ. 45 కోట్ల అవినీతి
మేము అధికారంలోకి వచ్చాకే ‘కుడా’ భూములను కాపాడాం
వాటి విలువ రూ.వందల కోట్లలోనే ఉంటుంది
కాళోజీ కళాక్షేత్రం నిర్మాణంలోనూ అవినీతి జరిగింది
విచారణ జరుగుతోంది.. త్వరలోనే నిజాలు బయటకొస్తాయి
దాస్యం వినయ్ భాస్కర్‌కు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి సవాల్
కాకతీయ, హన్మకొండ : కాంగ్రెస్ ప్రభుత్వంపై, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని, నిరాధారమని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, వరంగల్ ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తీవ్రస్థాయిలో ఖండించారు. శనివారం హనుమకొండలోని డీసీసీ భవనంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కుడా భూములపై మాజీ విప్, బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. కుడా స్థలాల విలువపై విమర్శలు చేయడం కాదని.. దమ్ముంటే గజం రూ. 75 వేల చొప్పున ఆయనే ఆ భూములను కొనుగోలు చేయాలని సవాల్ విసిరారు. కుడాపై చేసిన ఆరోపణలకు సంబంధించి బహిరంగ చర్చకు సిద్ధమైతే, తాము కూడా ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
కేటీఆర్ హయాంలోనే ‘కుడా’ నిధుల దోపిడీ
తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుడా సంస్థకు 225 ఎకరాల భూములను కేటాయించి, తద్వారా సంస్థకు రూ. 500 కోట్ల భారీ ఆదాయ వనరులను కల్పించామని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి గుర్తుచేశారు. కానీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి కేటీఆర్ కనుసన్నల్లోనే కుడా నిధుల్లో ఏకంగా రూ. 45 కోట్ల మేర అవినీతి, దోపిడీ జరిగిందని ఆరోపించారు. నగర పరిధిలోని ఏషియన్ మాల్ పక్కన ఉన్న స్థలంతో పాటు శాయంపేట, దీనదయాళ్ నగర్, రెడ్డిపురం ప్రాంతాల్లో వందల కోట్ల రూపాయల విలువైన కుడా భూములను కాంగ్రెస్ ప్రభుత్వమే రక్షించిందని స్పష్టం చేశారు. కుడా భూములు గజం రూ. 1.50 లక్షలకు అమ్ముడయ్యాయని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారానికి ఆధారాలు ఉంటే మీడియా ముందు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
పెట్టుబడిదారులను బెదిరిస్తున్నారు
వరంగల్ నగర సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడిదారులను తీసుకువస్తుంటే.. బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక వారిని బెదిరిస్తూ అభివృద్ధికి తీవ్ర ఆటంకం కలిగిస్తున్నారని ఇనగాల విమర్శించారు. వరంగల్ నగర కీర్తి కిరీటమైన కాళోజీ కళాక్షేత్రం నిర్మాణంలో గత పాలకులు చేసిన అవినీతిపై ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదు చేశామని, దీనిపై పూర్తి విచారణ జరుగుతోందని, త్వరలోనే అసలు నిజాలు ప్రజల ముందుకొస్తాయని చెప్పారు. అలాగే, అర్హులైన పేద లబ్ధిదారులకు ఎలాంటి రాజకీయ పక్షపాతం లేకుండా పార్టీలకు అతీతంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తుంటే, దాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తూ విమర్శలు గుప్పించడం సిగ్గుచేటన్నారు.
వచ్చే ఎన్నికల్లో వినయ్ భాస్కర్‌కు టికెట్ కూడా రాదు
గత అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ ప్రజలు వినయ్ భాస్కర్‌ను ఘోరంగా తిరస్కరించారని.. ఆయనపై ఉన్న ప్రజా వ్యతిరేకత కారణంగా వచ్చే ఎన్నికల్లో ఆయనకు సొంత బీఆర్ఎస్ పార్టీలోనే టికెట్ దక్కే పరిస్థితి లేదని వెంకట్రామ్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను, నగర అభివృద్ధిని చూసి తట్టుకోలేకే, ఉనికిని కాపాడుకునేందుకు వినయ్ భాస్కర్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ ముఖ్య నేతలు, వివిధ విభాగాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

