వరద కాలువకు నీరు విడుదల చేయాలి
వారం రోజుల్లో నీరు ఇవ్వకపోతే కన్నెపల్లికి పాదయాత్ర
స్పందించకపోతే మోటార్లు ఆన్ చేసి సాగునీరు అందిస్తాం
రాజకీయ కారణాలతో కాళేశ్వరం నీటిని వదలకుండా ఇబ్బందులు
రైతులతో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల మహాధర్నా
ఆచంపల్లి వరద కాలువ వద్ద వంటావార్పుతో బీఆర్ఎస్ నిరసన
కాకతీయ, కరీంనగర్ : వరద కాలువ ద్వారా వెంటనే సాగునీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీయ కారణాలతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని వినియోగించకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన ఆరోపించారు. కొత్తపల్లి మండలం నాగుల మల్యాల శివారులోని ఆచంపల్లి వరద కాలువ వద్ద ఆదివారం నియోజకవర్గానికి చెందిన సుమారు వెయ్యి మంది రైతులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడే వంటావార్పు చేపట్టి ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు.

స్పందించకపోతే కన్నెపల్లికి పాదయాత్ర
ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గొలుసుకట్టు చెరువులన్నీ నీటితో కళకళలాడగా, ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మేడిగడ్డ నుంచి నీరు విడుదల చేయకపోవడంతో చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు. ప్రస్తుతం కూడా వేలాది క్యూసెక్కుల నీరు సముద్రం పాలు అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతుల సంక్షేమం కోసమే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని, ఇప్పుడు ఆ ప్రాజెక్టును రాజకీయ కారణాలతో పక్కనబెట్టడం దుర్మార్గమన్నారు. కొత్తపల్లి మండలంలోని ఏడు గ్రామాలకు సాగునీరు అందేలా గతంలో ప్రత్యేక తూము నిర్మించామని, ఇందుకు భూములు ఇచ్చి సహకరించిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం వారం రోజుల్లోగా వరద కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని, లేకపోతే తామే భారీ మోటార్లు ఏర్పాటు చేసి రైతులకు సాగునీరు అందిస్తామని హెచ్చరించారు. ఒకవేళ ప్రభుత్వం అప్పటికీ స్పందించకపోతే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, పార్టీ ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి కన్నెపల్లి వరకు భారీ పాదయాత్ర చేపడతామని స్పష్టం చేశారు. అక్కడికి చేరుకుని తామే స్వయంగా మోటార్లు ఆన్ చేసి సాగునీరు అందిస్తామని గంగుల కమలాకర్ హెచ్చరించారు.

