నాచినపల్లిలో క్షుద్ర పూజల కలకలం
గుప్త నిధుల కోసమేనా?.. భయాందోళనలో గ్రామస్థులు
పోలీసుల అదుపులో పూజారులు
కాకతీయ, దుగ్గొండి: క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారనే సమాచారం గ్రామంలో కలకలం రేపింది. దుగ్గొండి మండలంలోని నాచినపల్లి గ్రామంలో ఓ ఇంటి వెనుక భాగంలో పట్టపగలు కొందరు సుమారు నాలుగు అడుగుల గుంత తవ్వి, జంతు బలికోసం ఏర్పాటు చేసుకొని అనుమానాస్పదంగా పూజలు నిర్వహిస్తుండటాన్ని గమనించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గుప్త నిధుల కోసం ఈ పూజలు నిర్వహిస్తున్నారా అనే అనుమానాలు గ్రామంలో చర్చనీయాంశంగా మారాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పూజలు నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పెండ్యాల రాజు మాట్లాడుతూ, ప్రజలు మూఢనమ్మకాలను విశ్వసించవద్దని, ఇటువంటి ఘటనలతో భయాందోళనకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామంలో శాంతిభద్రతలు, సామాజిక సామరస్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ చైతన్యంతో వ్యవహరించాలని కోరారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టగా, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని తెలిపారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

