కూరగాయల వ్యాపారులు సిండికేట్
కృత్రిమ ధరలతో సామాన్యుల దోపిడీ
రోడ్ల ఆక్రమణతో ట్రాఫిక్ సమస్యలు
మున్సిపల్ కమిషనర్‌కు తుడుం దెబ్బ నేతల ఫిర్యాదు
కాకతీయ, మణుగూరు: ఏజెన్సీ ప్రాంతమైన మణుగూరు మండల కూరగాయల మార్కెట్‌లో కొందరు గిరిజనేతర వ్యాపారులు సిండికేట్‌గా మారి కృత్రిమంగా ధరలు పెంచుతూ ప్రజలను దోచుకుంటున్నారని తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్లెం కోటి ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో మణుగూరు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఏజెన్సీలోని గిరిజనులు, పేద, మధ్యతరగతి ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని వ్యాపారులు ఒకే ధరను నిర్ణయించి అధిక రేట్లకు అమ్ముతున్నారని, దీంతో సామాన్యులు నిత్యావసర కూరగాయలు కొనలేని పరిస్థితి నెలకొందని అల్లెం కోటి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మణుగూరు ప్రధాన రహదారిని ఆక్రమించి కూరగాయల వ్యాపారం చేయడం వల్ల నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అత్యవసర సేవల వాహనాల రాకపోకలకు కూడా ఆటంకం కలుగుతోందని, వెంటనే రోడ్డు ఆక్రమణలు తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. మార్కెట్‌లో ధరల పెరుగుదలపై ప్రత్యేక విచారణ చేపట్టి, సిండికేట్‌గా వ్యవహరించి కృత్రిమంగా ధరలు పెంచినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వ్యాపార అనుమతులు రద్దు చేయాలని కోరారు. ప్రతి దుకాణంలో రోజువారీ అధికారిక ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీలో గిరిజనుల హక్కులు, వినియోగదారుల ప్రయోజనాలు కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని, అధికారులు స్పందించకపోతే తుడుం దెబ్బ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని అల్లెం కోటి హెచ్చరించారు.

