అభివృద్ధి పనులు వేగిరం చేయాలి
నత్తనడకన దొడ్ల, కొండాయి బ్రిడ్జిల నిర్మాణం
రామన్నగూడెం కరకట్టపై శాశ్వత పరిష్కారం చూపాలి
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భూక్యా జవహర్
కాకతీయ, ఏటూరునాగారం, రూరల్: ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు వినుకొల్ల చక్రవర్తి ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భూక్యా జవహర్ మాట్లాడుతూ మండలంలోని పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దొడ్ల, కొండాయి బ్రిడ్జిల నిర్మాణ పనులు చాలా కాలంగా నత్తనడకన సాగుతున్నాయని జవహర్ అసహనం వ్యక్తం చేశారు. గతంలో కొండాయి వద్ద వరదల కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటనను గుర్తు చేస్తూ, ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని కోరారు. రామన్నగూడెం కరకట్ట నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాకపోవడం శోచనీయమని, కేవలం ఇసుక బస్తాలతో తాత్కాలికంగా సమస్యను పరిష్కరించడం సరికాదని ఆయన విమర్శించారు.
పెండింగ్ పనులపై ప్రభుత్వం దృష్టి సారించాలి
ఎడిశెట్టిపల్లి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై జవహర్ తీవ్రంగా స్పందించారు. కేవలం పడవలు వేసి కొబ్బరికాయలు కొట్టడం వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం కావని, ప్రభుత్వం తన బాధ్యతను గుర్తించి పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి రవీంద్ర చారి, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కుర్ర సుమలత, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు వావిలాల జనార్ధన్, జిల్లా మహిళా నాయకురాలు పలక గంగ, మండల ప్రధాన కార్యదర్శి కర్నే సంపత్, మాజీ ఎంపీటీసీ ఎర్రల్ల ఎల్లయ్య, మండల ఉపాధ్యక్షుడు దుర్గం దుర్గారావు, మాజీ మండల అధ్యక్షుడు గాడిచర్ల రాజశేఖర్, మహిళా సీనియర్ నాయకురాలు ఆత్కూరి ప్రేమలత, మండల సోషల్ మీడియా కన్వీనర్ దుర్గం శ్రావణ్, యూత్ నాయకుడు కొండగొర్ల రాంబాబు, మహిళా నాయకురాలు మలకం స్వరూప, గోరింట వినోద, వినుకొల్ల ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

