సైబర్ కేసులో నిందితురాలి అరెస్టు
ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రూ. 15 లక్షల మోసం
కేరళలో నిందితురాలిని పట్టుకున్న పోలీసులు
దేశవ్యాప్తంగా రూ.3కోట్ల లావాదేవీలు గుర్తింపు
కాకతీయ, ఖమ్మం టౌన్: ఆన్‌లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి సుమారు 15 లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన కేసులో ఒక మహిళను ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు కేరళలోని త్రివేండ్రం పట్టణంలో అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఈ కేసు వివరాలను వెల్లడిస్తూ, ఖమ్మం జిల్లాకు చెందిన ఒక ప్రైవేట్ ఉద్యోగికి వాట్సాప్‌లో పరిచయమైన గుర్తు తెలియని వ్యక్తులు ‘ఎనమ్ అసెట్ మేనేజ్‌మెంట్ పోర్ట్‌ఫోలి లిమిటెడ్’ పేరుతో ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపారు. దీనిని నమ్మి సదరు బాధితుడు వివిధ లింకుల ద్వారా రూ. 15 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సదరు అకౌంట్ హోల్డర్ మరియు అడ్వకేట్ అయిన ఆర్యదాస్ శైలజ (34) అనే మహిళా నిందితురాలిని కేరళలోని త్రివేండ్రం సిటీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమె ఖాతా ద్వారానే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సుమారు 38 క్రైమ్ కేసులకు సంబంధించి సుమారు 3 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. నిందితురాలిని ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ఖమ్మం తీసుకువచ్చి, సైబర్ క్రైమ్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు కమిషనర్ తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణిందర్, ఇన్‌స్పెక్టర్ రవి కుమార్, ఎస్సైలు రంజిత్ కుమార్, విజయ్ కుమార్ మరియు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.

