విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం నిర్లక్ష్యం
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.ఎల్. రవి
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ములుగు కలెక్టరేట్ ముట్టడి
కాకతీయ, ములుగు ప్రతినిధి : జిల్లాలో నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం వందలాది మంది విద్యార్థులు ములుగు కలెక్టరేట్‌ను ముట్టడించారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం జిల్లా అధికారులకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.ఎల్. రవి మాట్లాడుతూ, జిల్లాలో ప్రభుత్వ విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రధానంగా మల్లంపల్లిలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థులు రవాణా సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి సౌకర్యం కోసం ఆ పాఠశాలను వెంటనే ఏటూరునాగారానికి తరలించాలని డిమాండ్ చేశారు. అలాగే ములుగు జిల్లా కేంద్రంలో ఎస్సీ డిగ్రీ విద్యార్థులకు హాస్టల్ వసతి లేక పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని, తక్షణమే హాస్టల్ మంజూరు చేయాలని కోరారు. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదులు, ఫర్నిచర్, ల్యాబ్స్ మరియు గ్రంథాలయాలు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం విద్యా ప్రమాణాలను దెబ్బతీస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, లేనిపక్షంలో జిల్లావ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జాగటి రవితేజ, ఉపాధ్యక్షుడు కోగిల బాలు, ములుగు మండల నాయకులు బి. సందేశ్, పుర్రి శివ, చిలువేరు డేవిడ్, లక్ష్మణ్, భరత్ తదితరులతో పాటు సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

