ఆవిష్కరణలతోనే పారిశ్రామికాభివృద్ధి సాధ్యం
ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్
ములుగులో ఘనంగా తేజస్ వర్క్‌షాప్
స్టార్టప్‌లు, యువ పారిశ్రామికవేత్తలకు దిశానిర్దేశం
కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలపై అవగాహన
కాకతీయ, ములుగు ప్రతినిధి : వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో విలువ ఆధారిత ఉత్పత్తులు, ఆధునిక సాంకేతికత వినియోగం, యువ పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం పెరగడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని రాయల్ ప్లాజాలో జీఎం ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన తేజస్ వర్క్‌షాప్ మంగళవారం విజయవంతంగా జరిగింది. పరిశ్రమలు, స్టార్టప్‌లు, యువ పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, జీఎం ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ సిద్ధార్థ రెడ్డి అధ్యక్షత వహించారు.
నూతన ఆవిష్కరణలపై అవగాహన
వర్క్‌షాప్‌లో డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ప్రతినిధులు వర్చువల్ విధానంలో పాల్గొని ఆవిష్కరణలు, పారిశ్రామిక అభివృద్ధి, స్టార్టప్‌లకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహక పథకాలు, నూతన అవకాశాలపై సమగ్రంగా వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలు, శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని బాదం ప్రవీణ్ పిలుపునిచ్చారు.
సృజనాత్మకతతోనే దేశాభివృద్ధి
నూతన ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, యువతలో సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర, దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని సిద్ధార్థ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో టీజీఐసీ ప్రతినిధి రమేష్, రిచ్ ప్రతినిధి చరణ్, ఎంఎస్‌ఎంఈ ప్రతినిధి ధనుంజయ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కోశాధికారి మోహన్, డీఆర్‌డీఏ ఏపీడీ శ్రీనివాస్, డీపీఎం దేవానందం, వహీద్, సలీం, స్వయం సహాయక సంఘాల మహిళలు, పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

