- ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోవాలి
- సాగుపై ఎల్నినో ప్రభావం ఉంటోంది
- రైతులను ఆరుతడి పంటల వైపు ప్రోత్సహించాలి
- పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
- గీసుగొండలో సర్పంచులు, కార్యదర్శులకు శిక్షణ
కాకతీయ, గీసుగొండ : ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగించి, గ్రామాల అభివృద్ధికి సర్పంచులు చిత్తశుద్ధితో కృషి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు. గీసుగొండ మండలంలోని గంగదేవిపల్లి పంచాయతీ శిక్షణ కేంద్రంలో, గీసుగొండ మరియు సంగెం మండలాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన ‘గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, తన ఐదేళ్ల పదవీకాలంలో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్ది ప్రజల విశ్వాసాన్ని పొందడమే ప్రతి ప్రజాప్రతినిధి లక్ష్యం కావాలని సూచించారు. గంగదేవిపల్లి మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి చేపట్టిన అభివృద్ధి పనులను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యం, పచ్చదనం వంటి మౌలిక అంశాలకు మొదటి ప్రాధాన్యతనిస్తూ, పారదర్శకంగా నిధులను ఖర్చు చేయాలని ఆదేశించారు.
రైతులకు అవగాహన కల్పించాలి
ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున, రైతులు తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపేలా గ్రామస్థాయిలో సర్పంచులు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. పంటల మార్పిడి, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచవచ్చని ఆయన పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆధ్వర్యంలో సర్పంచులు, కార్యదర్శులు జలసిరి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సుమ, జడ్పీ సీఈఓ రాం రెడ్డి, డిఆర్డిఓ నాగపద్మజ, డిపిఆర్ఓ ప్రేమలత, డిపిఓ కటకం కల్పన, ఎంపీడీఓలు, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

