- రైతుల సమస్యలపై స్పష్టత లేని సీఎం
- ప్రభుత్వ నిధులను రాజకీయ విమర్శలకు వాడుకోవడం దారుణం
- సభ కోసం భూములిచ్చిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలి
- బీఆర్ఎస్ జిల్లా నాయకులు మంకెన రమేష్
కాకతీయ, చింతకాని: రైతు ఆశీర్వాద సభ రైతుల సమస్యలను పరిష్కరించడానికి కాకుండా, కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమైందని బీఆర్ఎస్ జిల్లా నాయకులు మంకెన రమేష్ విమర్శించారు. చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలోని మాజీ వైస్ ఎంపీపీ గురజాల హనుమంతరావు నివాసంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, రైతు రుణమాఫీ, రైతు భరోసా, దళిత బంధు, గృహలక్ష్మి పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి నుండి స్పష్టమైన ప్రకటన వస్తుందని రైతులు, మహిళలు ఆశించారని, కానీ సీఎం వాటిపై ఏమీ మాట్లాడకుండా కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్లపై వ్యక్తిగత దూషణలకు దిగడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.
ప్రభుత్వ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత రాజకీయ వేదికగా మార్చారని ఆరోపించారు. సభకు భారీగా జనాన్ని తరలించాలని అధికారులు బస్సులు ఏర్పాటు చేసినా, రైతులు స్పందించకపోవడంతో సభ వెలవెలబోయిందని పేర్కొన్నారు. అంచనాలకు మించి జనం రాలేదని, దీనిని బట్టి రైతులు కాంగ్రెస్ పాలనను ఎలా చూస్తున్నారో అర్థమవుతుందని అన్నారు. సభ కోసం భూములిచ్చిన జగన్నాధపురం, మత్కేపల్లి రైతులకు ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల నాయకులు బొడ్డు వెంకట రామారావు, మాజీ వైస్ ఎంపీపీ గురజాల హనుమంతరావు, మాజీ ఎంపీపీ పోనుగోటి రత్నాకర్, లచ్చగూడెం ఉప సర్పంచ్ పొట్ల సీతయ్య, కొదమూరు ఉప సర్పంచ్ చిట్టిమోదు రాంబాబు, కోడుమూరు బీఎల్ఏ రేగుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

