- : మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
- బీజేపీ నుంచి బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు
కాకతీయ, ఆత్మకూరు: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం హనుమకొండలోని ఆయన నివాసంలో ఆత్మకూరు మండలానికి చెందిన పలువురు బీజేపీ సీనియర్ నాయకులు చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఆయన పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని, ఆ పార్టీ పాలనలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుబంధు పథకం నిలిచిపోయిందని, అప్పట్లోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగా రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసే నేడు అనేక మంది కార్యకర్తలు ఇతర పార్టీల నుండి బీఆర్ఎస్‌లో చేరుతున్నారని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మాజీ ఎంపీటీసీ బయ్యా రమా రాజు, బీజేపీ సీనియర్ నాయకులు భాషాబోయిన సుధాకర్, బయ్యా శ్రీనివాస్, బయ్యా సదానందం, గుండెబోయిన రఘుపతి, కుక్కల కుమారస్వామి తదితరులు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల అధ్యక్షుడు సంజీవ రెడ్డి, ఉపసర్పంచ్ భాషాబోయిన పైడి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వంగల భగవాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

