- ఆది ఆదరిస్తాడా? అధిష్ఠానం గుర్తిస్తుందా?
- విధేయతకు విలువనిస్తారా? వర్గ సమీకరణాలకే ప్రాధాన్యతనిస్తారా?
- జిల్లా కాంగ్రెస్ శ్రేణుల మధ్య జోరుగా చర్చ
- రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ విధేయుడిగా గుర్తింపు
- పార్టీ కష్టకాలంలో జెండా మోసిన లీడర్‌గా శ్రేణుల్లో అభిమానం
- రాజన్న ఆలయ చైర్మన్ పదవిపై సీనియర్ నేత ఆశలు

కాకతీయ, వేములవాడ : రాజకీయాల్లో గాలి ఎటు వీస్తే అటు తిరిగే నాయకులు కోకొల్లలు. కానీ, గాలిలో కాంగ్రెస్ జెండా తలకిందులవుతున్న సమయంలోనూ.. ఆ జెండాను భుజాన వేసుకుని, రెక్కలు ముక్కలు చేసుకుని పార్టీని కాపాడుకున్న నాయకుడు ‘నాగం కుమార్’. రెండు దశాబ్దాలుగా పార్టీ పట్ల చూపిస్తున్న అచంచలమైన విధేయత ఇప్పుడు ఆయన్ని నామినేటెడ్ పోస్టుల రేసులో ముందు వరుసలో నిలబెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీకి సిద్ధమవుతున్న వేళ, ఈసారి నాగం కుమార్ కు న్యాయం జరుగుతుందా? అన్నదే వేములవాడ కాంగ్రెస్ వర్గాల్లో ప్రధాన చర్చ. 2005లో ఎన్‌ఎస్‌యూఐతో మొదలైన నాగం కుమార్ రాజకీయ ప్రస్థానం, నేటికీ అదే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోంది. అధికారం ఎటుంటే అటు జంప్ చేసే రాజకీయ నేతలకు భిన్నంగా.. కష్టకాలంలోనూ ఆయన కాంగ్రెస్‌ను వీడలేదు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, చందుర్తి జడ్పీటీసీగా ఆయన ప్రస్థానం పార్టీ శ్రేణులకు సుపరిచితమే. పార్టీకి పదవులు లేని సమయంలో, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా పార్టీ జెండాను పట్టుకుని కార్యకర్తలకు అండగా నిలవడమే ఆయన చేసిన నేరమా? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. నిజాయితీగా, నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తకు గుర్తింపు దక్కకుంటే, ఇంకెవరికి దక్కుతుందని పార్టీ కార్యకర్తలు నిలదీస్తున్నారు.

ఉద్యమం నుంచి ప్రజా సమస్యల వరకు
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన నిర్వహించిన పాదయాత్రలు, 2013లో తిప్పాపూర్ వరకు చేపట్టిన సుదీర్ఘ యాత్ర, 2017లో నిరుద్యోగ యాత్ర వంటివి ఆయనను ప్రజా నాయకుడిగా నిలబెట్టాయి. జడ్పీటీసీగా ఉన్నప్పుడు అధికార పార్టీ ఒత్తిళ్లను సైతం లెక్కచేయకుండా ప్రజా సమస్యలపై గళమెత్తిన ఆయన, పార్టీకి ఒక బలమైన గొంతుకగా మారారు. నేడు పార్టీ పగ్గాలు చేపట్టిన అగ్రనేతలు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. నాగం కుమార్ వంటి నిబద్ధత కలిగిన కార్యకర్తల సేవలను గుర్తించాల్సిన బాధ్యత తమపై ఉందని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. విధేయతకు విలువ ఇస్తారా? లేక వర్గ సమీకరణాలకే పెద్దపీట వేస్తారా? అనే సందిగ్ధంలో కాంగ్రెస్ శ్రేణులు ఉన్నాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పదవికి నాగం కుమార్ పేరు బలంగా వినిపిస్తోంది. ఒకవేళ ఇక్కడ కుదరని పక్షంలో, రాష్ట్ర స్థాయిలోనైనా ఆయనకు తగిన గుర్తింపు లభిస్తుందని పార్టీ శ్రేణులు ఆశిస్తున్నాయి. పదవుల కోసం పాకులాడే వారికి కాకుండా, పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇస్తేనే కార్యకర్తల్లో ఉత్సాహం పెరుగుతుందని సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
విధేయుడికి దక్కేనా పట్టా?
నాగం కుమార్ రాజకీయ ప్రయాణంలో ఎదురుచూపులు ముగిసి, ఆయనకు న్యాయం జరుగుతుందా? లేదా గతంలో లాగే ఎదురుచూపులే మిగులుతాయా? అన్నది ఇప్పుడు పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. పార్టీ కోసం అనేక త్యాగాలు చేసిన కాంగ్రెస్ విధేయుడికి అధిష్ఠానం గుర్తింపు ఇస్తుందా? అన్న ప్రశ్నకు మరికొద్ది రోజుల్లోనే సమాధానం దొరకనుంది. కార్యకర్తలను, నిబద్ధతను గౌరవించుకునే పార్టీగా కాంగ్రెస్ నిలుస్తుందా? లేక రాజకీయ సమీకరణాలకే పరిమితమవుతుందా? అన్నది వేచి చూడాలి.

