- టెండర్ షరతులపై బల్దియా కాంట్రాక్టర్ల ఆందోళన
- వివాదాస్పద టెండర్లను రద్దు చేయాలని కమిషనర్ ఆదేశాలు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హార్టికల్చర్ వింగ్‌లో టెండర్ షరతులను మార్చి కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ హార్టికల్చర్ కాంట్రాక్టర్లు సోమవారం బల్దియా గ్రీవెన్స్‌లో కమిషనర్ వెంకన్నను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2008 నుంచి జీడబ్ల్యూఎంసీలో పనిచేస్తున్న ఉద్యానవన కాంట్రాక్టర్లు, బల్దియా పట్టణ జీవవైవిధ్య విభాగం కింద నమోదైన వారు తమ ఆవేదనను కమిషనర్ ముందు వెల్లడించారు. గతేడాది జూలై 10వ తేదీన సర్కిల్-1 ఉద్యానవన పనులకు పిలిచిన టెండర్ నిబంధనలను మార్చారని, ఎలాంటి అనుభవం లేకుండానే టెండర్లు పిలుస్తున్నారని తెలిపారు. గత మూడు నెలలుగా సిహెచ్‌వో రమేష్ తన బినామీకి టెండర్లు వచ్చేలా హార్టికల్చర్ వింగ్‌కు విరుద్ధంగా సివిల్ డిపార్ట్‌మెంట్ నుంచి టెండర్లు పిలిపిస్తున్నారని, కొందరు ఇంజినీరింగ్ అధికారులు హార్టికల్చర్ కాంట్రాక్టర్లను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. గత 20-30 సంవత్సరాలుగా ఆన్‌లైన్ టెండర్ విధానంలో పనిచేస్తున్న తమను ఆదుకోవాలని కోరారు.
కమిషనర్ స్పందన..
కాంట్రాక్టర్ల వివరణను సానుకూలంగా విన్న కమిషనర్.. వివాదాస్పద టెండర్లను రద్దు చేసి రీ-కాల్ చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ తీసుకున్న తక్షణ నిర్ణయంతో హార్టికల్చర్ కాంట్రాక్టర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రగోత్తం రెడ్డి, పావురము రెడ్డి, ఎం.వి. రెడ్డి, సత్యం, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

