- దుగ్గొండి మండలం రేకంపల్లిలో చర్చనీయాంశంగా ప్రొటోకాల్ అంశం
- పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఫోటోను విస్మరించిన అధికారులు
- రాజకీయ వర్గాల్లో భిన్న చర్చాలకు తావిచ్చిన అంశం
కాకతీయ, నర్సంపేట టౌన్ : పంచాయతీరాజ్ శాఖ పరిధిలో నిర్మించనున్న నూతన గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా, సంబంధిత శాఖ మంత్రి సీతక్క ఫోటో బ్యానర్లో లేకపోవడం స్థానికంగా మరియు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రేకంపల్లి గ్రామంలో ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామపంచాయతీ భవనానికి, పది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న మహిళా సంఘ భవనానికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
గతంలో గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ విశేష కృషి చేసిందని, భవిష్యత్తులో కూడా గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి కొనసాగిస్తామని తెలిపారు. అయితే, పంచాయతీరాజ్ శాఖ నిధులతో చేపడుతున్న ఈ అధికారిక భవన నిర్మాణ కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీ బ్యానర్లో, ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దనసరి అనసూయ (సీతక్క) ఫోటో లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మరియు స్థానిక ప్రజాప్రతినిధుల ఫోటోలకు పెద్దపీట వేసినప్పటికీ, సంబంధిత శాఖా మంత్రికి చోటు దక్కకపోవడం యాదృచ్ఛికమా లేక కావాలనే విస్మరించారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

