- రైతుల పక్షాన పోరాటం కొనసాగుతుంది
- మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
కాకతీయ, కరీంనగర్ / మల్యాల: వరద కాలువ నీటిని వెంటనే విడుదల చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ మల్యాల మండలంలో రైతులు చేపట్టిన నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను పోలీసులు అడ్డుకుని ప్రివెంటివ్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది.ఇదే సమయంలో రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై జేఎన్టీయూ సమీపంలోని దొంగలమర్రి వద్ద రాస్తారోకో చేపట్టారు. జీవన్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
పోలీసులు నిరసనను అడ్డుకుని సుంకె రవిశంకర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని గంగాధర పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, రైతులకు సాగునీరు అందించాలని కోరుతున్న నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. నిర్బంధాలు, అరెస్టులతో రైతుల సమస్యలను అణచివేయలేరని, ప్రభుత్వం వెంటనే వరద కాలువ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు నీరు అందించకపోతే రానున్న రోజుల్లో భారీ స్థాయిలో ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

