ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ
దేశంలో నియంతృత్వ పాలన సాగిస్తున్న కేంద్రం
విద్యార్థుల రక్తంతో చేతులు తడిపిన మోదీ సర్కారు
వరంగల్ డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్
రాహుల్ గాంధీపై దాడిని నిరసిస్తూ మోదీ దిష్టిబొమ్మ దహనం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: నీట్ పేపర్ లీకేజీపై ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేసి, ముక్కు నుంచి రక్తం వచ్చేలా ఈడ్చుకువెళ్లిన బీజేపీ ప్రభుత్వ దురాగతాన్ని ఖండిస్తూ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర నిరసన తెలిపారు. బుధవారం పోచమ్మ మైదాన్ సెంటర్లో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ సారధ్యంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్లో ప్రతిపక్షం గళం నొక్కేస్తూ మైకులు కట్ చేస్తున్నారని, జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, వారి తరఫున ప్రశ్నించడానికి వెళ్లిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై పోలీసులు పాశవికంగా దాడులు చేసి అమానుషంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. రెండు కోట్ల ఉద్యోగాల పేరుతో మోసం చేసి, పేపర్ లీక్‌లతో లక్షలాది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల రక్తంతో చేతులు తడిపిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, విద్యార్థులపై దాడికి ప్రధాని మోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ ఫాసిస్ట్ పాలనకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడుతారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కొరివి పరమేష్, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


